లక్షా 20వేల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్
టకాటా ఎయిర్ బ్యాగ్ లోపాలు జర్మన్ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్ సాంకేతిక లోపాలకారణంగా అమెరికాలో దాదాపు లక్షా 20వేలకార్లను వెనక్కి పిలిపించనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు జర్మన్ పేపర్ బిల్డ్ శుక్రవారం తన వెబ్ సైట్లో వెల్లడించింది. సంస్థ ప్రతినిధి మాటలను ఉటంకించిన బిల్డ్ .. జర్మనీ ఆటో మొబైల్ బీఎండబ్ల్యూ కార్లలో ఉపయోగించిన టకాటా ఎయిర్ బ్యాగ్‌లో లోపాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోనుందని తెలిపింది. 2006-11 మధ్యలో తయారైన ఎక్స్ 5,ఎక్స్ 6 మోడల్స్ ను రీకాల్ చేయనున్నట్టు సంస్థ ప్రతినిధి తెలిపారని పేర్కొంది.
అమెరికా రెగ్యులేటరీ డాక్యుమెంట్ల ప్రకారం ఎనిమిది కార్ల కంపెనీలు (బీఎండబ్ల్యూ లేదు) టకాటా ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా అమెరికాలో 12 మిలియన్ల కు మించి కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ వార్తలపై ఇంతవరకు బీఎండబ్ల్యూ స్పందించలేదు.
కాగా ఈనేపథ్యంలోనే వేల సంఖ్యలో ఫోక్స్‌వ్యాగన్ , బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లను రీకాల్ చేశాయి. టాకాటా ఎయిర్ బ్యాగ్‌లో సమస్యలు ఉండటంతో బీఎండబ్ల్యూ, ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్ సంస్థలు అమెరికాలో విక్రయించిన దాదాపు 2.5 మిలియన్ల కార్లను రీకాల్ చేశాయి. ఫోక్స్‌వ్యాగన్ సంస్థ 8,50,000 కార్లను, బీఎండబ్ల్యూ, బెంజ్‌లు చెరో 8,40,000 కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. జపాన్ కు చెందిన టకాటా 2019 నాటికి 40 మిలియన్ కార్లలో ఎయిర్ బ్యాగ్ లోపాలున్నట్టు గతనెలలో అంగీకరించింది. దీంతో దాదాపు 17 ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి.