దాదర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
ముద్దనూరు(జమ్మలమడుగు): వైఎస్సార్‌జిల్లా ముద్దనూరు రైల్వేస్టేషన్ వద్ద ప్లాట్‌ఫాంకు 100 మీటర్ల దూరంలో పట్టాల పాయింట్ (కమ్మీలను వేరుచేసే, కలిపే ప్రాంతం)మధ్యలో ఇనుప బోల్టు ఇరుక్కుపోయింది. దీంతో ముంబయి–చెన్నై(రైలు నం.11041)ఎక్స్‌ప్రెస్ కు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. కొండాపురం నుంచి ముద్దనూరుకు చేరుకోవాల్సిన రైలు అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంకు వందమీటర్ల దూరంలో ఆగిపోయింది.పట్టాల మధ్యలో పాయింట్ వద్ద బోల్టు అడ్డుపడిన విషయాన్ని విధుల్లో వున్న గేట్మెన్ వరదరాజులు ముందే గమనించాడు.రైలు గేటు వద్దకు రాకముందే ఆయన పరుగెత్తుకెళ్లి ఎర్రజెండా ఊపి ఆపివేశారు.డ్రైవరు రైలు దిగి విషయాన్ని గ్రహించాడు.బోల్టు అడ్డుపడితే రెండు కమ్మీలు కలుసుకునే అవకాశం ఉండదని, రైలు ముందుకెళ్లి ఉంటే పట్టాలు తప్పి ప్రమాదం సంభవించేదని పలువురు రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.అనంతరం రైల్వే సిబ్బంది బోల్టును తొలగించారు.ఈ ఘటనతో దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయింది.ప్రమాదాన్ని నివారించిన గేట్మెన్ వరదరాజులును ప్రయాణికులు,సిబ్బంది అభినందించారు.