12 నెలలు.. 12 దృశ్యాలు
వాషింగ్టన్: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ప్రతి సంద్భంలోనూ గడిచిన 12 నెలల కాలాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవడం పరిపాటి. 2016కు సంబంధించి 366 రోజుల్లో ప్రపంచంలో ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. కొన్ని మాత్రమే మర్చిపోలేనివిగా, మననం చేసుకునేవిగా మిగిలిపోయాయి. అలాంటివాటిలో కొన్నింటిని ప్రపంచ ప్రఖ్యాత 'గెట్టి ఫొటో ఏజెన్సీ' ఏర్చికూర్చింది.
8కోట్ల ఫొటోలు, 50వేల పైచిలుకు ఫిల్మ్ఫుటేజీల కలెక్షన్లు కలిగిఉన్న పబ్లిషింగ్, మీడియా, వెబ్‌డిజైనింగ్ సంస్థగా 'గెట్టి ఏజెన్సీ' రూపొందించిన '12 నెలలు.. 12 దృశ్యాలు' ఫొటో ఫీచర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచ దేశాల్లో చోటుచేసుకున్న 12 సంఘటనల తాలూకు అద్భుతమైన 12 ఫొటోలు ఇలా ఉన్నాయి..
గాడ్ సేవ్ అమెరికా!
కనెక్టికట్‌లోని శాండిహుక్ ఎలిమెంటరీ స్కూల్లో(డిసెంబర్ 2015) ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ముక్కుపచ్చలారని 20 మంది చిన్నారులు తునాతునకలైన ఘటన అందరినీ దిగ్భాంతికి గురిచేసింది. ఆ చిన్నారులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో.. అమెరికాలో పెట్రేగుతోన్న 'గన్ కల్చర్'పై వేదనను వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు ఒబామా కన్నీరు పెట్టుకున్నప్పటి దృశ్యాన్ని గెట్టి.. 2016 జనవరి శక్తిమంతమైన ఫొటోగా అభివర్ణించింది.
యుద్ధసౌందర్యం!
నాలుగేళ్లుగా సిరియాలో సాగుతోన్న అంతర్యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. అక్కడి అలెప్పో నగరంలో సైనిక యుద్ధట్యాంకు పేలుడు జరిపిన క్షణాన చిత్రీకరించిన ఈ ఫొటో 2016 ఫిబ్రవరిలో టాప్ ఫొటోగా నిలిచింది.
బ్రసెల్స్ ఘాతుకం
బెల్జియం రాజధాని, యురోపియన్ యూనియన్ ముఖ్యపట్టణం బ్రసెల్స్‌లోని ఎయిర్‌పోర్టులో 2016 మార్చిలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన జంటపేళ్లల్లో గాయపడ్డి దిగ్భాంతికిలోనైన మహిళ(కుడి), షాక్ నుంచి తేరుకుని సొంతవాళ్లకు సమాచారం అందిస్తున్న మరో మహిళ(ఎడమ)
ఆమెకు మద్దతుగా అతివలు
తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షపదవికి దిల్మా రౌసెఫ్ రాజీనామా చేసిన సందర్భంలో ఆమెకు మద్దతుగా ఆ దేశ అతివలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు. 2016 ఏప్రిల్‌లో జరిగిన ఓ ర్యాలీలో కనిపించిన దృశ్యమిది.
కొత్తగా పాత భీతావాహం
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో బ్రిటన్‌పై జర్మనీ దాడులు జరిపిన ప్రాంతాలను వెతికి శోధించి, వాటిని ఫొటోలు తీసి, నాటి ఫొటోలతో వాటిని కలగలిపిజిమ్ డైసన్ అనే ఫొటోగ్రాఫర్ సృష్టించిన అద్భుతమిది. 'ది బ్లిట్జ్'గా అభివర్ణించే ఆ దాడులు జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2016 మే లో ఈ ఫొటోను రూపొందించారు.
అభిమానం వెర్రితలలు
యూరో కప్ 2016లో భాగంగా ఫ్రాన్స్ వేదికగా జరగాల్సిన ఇంగ్లాండ్-రష్యా ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల అభిమానులు తన్నకుచావడం, రంగప్రవేశం చేసిన పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించడం క్రీడాస్ఫూర్తికి మాయని మచ్చగా మిగిలిపోయాయి.
విఫల తిరుగుబాటు
'అరబ్ వసంతం' స్ఫూర్తిని పూర్తిగా అందిపుచ్చుకోకముందే 2016 జులైలో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు దారుణంగా విఫలమైంది. గంటల వ్యవధిలోనే తిరుగుబాటు దళాలు.. ప్రజలు, ప్రభుత్వ దళాల చేతిలో భంగపడ్డారు.
అటు మెరుపులు.. ఇటు మరకలు..
దేశ జనాభాలో సగం మంది పేదరికంలో మగ్గుతుండగా బ్రెజిల్ నిర్వహించిన ఒలింపిక్ వేడుకల దృశ్యాలివి. 2016 ఆగస్టులో రియోలో ఒలింపిక్ ప్రారంభోత్సవాన్ని, అక్కడికి దగ్గరలోని స్లమ్ నుంచి వీక్షిస్తున్న యువత ఫొటో సమాజంలోని అంతరాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
సాహసం శాయరా..
కర్జీజ్స్థాన్లో ఏటా సెప్టెంర్‌లో నిర్వహించే నోమాడ్ గేమ్స్‌లో ఒంటికి నిప్పంటించుకుని మరీ గుర్రపు పందేల్లో పాల్గొనే సాహసక్రీడకు స్థానికంగా గొప్ప ఆదరణుంది.
అగ్నిపర్వతం కాదది..
కల్లోల సిరియాలో 2016 అక్టోబర్‌లో ఐసిస్ ముష్కరులు పంటపొలాలకు నిప్పంటించి ధ్వంసం చేసినప్పటి ఫొటో ఇది.
'కొత్త'పెద్దన్న
ఒక్క అమెరికన్లకు తప్ప మిగతా ప్రపంచానికి దాదాపు షాకిస్తూ 2016 నవంబర్‌లో అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డోనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాను తొలిసారి కలుసుకున్నదృశ్యం.
ఫిడెల్.. అమర్ రహే!
క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో అస్తికలకలు తరలిస్తుండగా, క్యూబన్ల వందనం. దీనిని 2016 డిసెంబర్ శక్తిమంతమైన ఫొటోగా గెట్టీ అభివర్ణించింది.