వద్దని వారిస్తున్నా.. చావుకు ఎదురెళ్లి..!
మెదక్: ఆనకట్టపై నడుచుకుంటూ వెళ్తూ.. అనుకోనిరీతిలో వరద ఉధృతిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడుపాయలలోని అమ్మవారి దర్శించుకున్న యువకుడు.. అనంతరం సమీపంలో ఉన్న ఘనపురం వాగుపై ఆనకట్టపై నడుచుకుంటూ వెళ్లాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని చుట్టుపక్కల ఉన్నవారు ఎంతగా వారించినా.. అదేమీ వినిపించుకోకుండా అతను ఆనకట్ట మీదకు వెళ్లాడు. దీంతో అనుకోనిరీతిలో అదుపుతప్పి వాగులో కొట్టుకుపోయాడు. అనంతరం స్థానికులు నాలుగు గంటలపాటు వెతికి.. అతడి మృతదేహాన్ని వెలికితీశారు.
అనూహ్యంగా మృత్యువాత పడ్డ ఆ యువకుడి వివరాలు తెలియరాలేదు. అతడు కావాలని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అనుకోనిరీతిలో ప్రమాదం జరిగిందా? అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి ప్రమాదకరస్థాయిలో ఉన్నా.. ఆనకట్ట మీదకు వెళ్లొద్దని తామంతా వారిస్తున్నా.. అదేమీ పట్టకుండా ఆ యువకుడు ముందుకువెళ్లాడని, అతని ప్రవర్తన అంతుచిక్కలేదని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు చెప్తున్నారు. అతడు ఆనకట్ట మీదకు వెళ్లి.. అదుపుతప్పి వాగులో కొట్టుకుపోయిన దృశ్యాన్ని ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.