Ghandhi bhavan
-
మీకు ఓట్లడిగే హక్కు లేదు..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని, కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు కూడా బీజేపీ నేతలు తేలేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందీ, విశ్వనగరమైందీ కాంగ్రెస్ హయాంలోనేనని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లతో కలసి ఆయన మాట్లాడారు. మెట్రో రైలు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జంట నగరాలకు కృష్ణా జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ప్రజలు గమనించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.67 వేల కోట్ల అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. పరిహారాన్ని పందికొక్కుల్లా మేశారు.. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని, కనీసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలేదని ఉత్తమ్ విమర్శించారు. 100 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరదలు వస్తే ప్రజలను ఆదుకోవాల్సింది పోయి బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా పందికొక్కుల్లా మేసిన ఘనత టీఆర్ఎస్ నాయకులదని ఎద్దేవా చేశారు. గత ఆరేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్‌కు రూపాయి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. అభివృద్ధి నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన ఐటీ రీజియన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తే కనీసం ఒక్క మాట కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, అన్ని విషయాల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వత్తాసు పలికిందని విమర్శించారు. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ కనుసన్నల్లో బీజేపీకి లబ్ధి జరిగే విధంగా వ్యవహరించిందని చెప్పారు. అందుకే ఆ పార్టీలను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని, తాము గెలిస్తే హైదరాబాద్ సుస్థిర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. వారం పాటు అప్రమత్తంగా ఉండాలి.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఉత్తమ్ కోరారు. మంత్రి కేటీఆర్ రోడ్‌షోలకు మాత్రం ఎల్ఈడీ లైట్లతో ప్రచారానికి అనుమతినిచ్చిన ఈసీ.. తామడిగినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని, ఈ వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఎన్నికలను ఎదుర్కోవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ హోర్డింగులు తొలగించరా? : పొన్నం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన హోర్డింగులతో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము ఎన్నికల కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వ హోర్డింగులను తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హోర్డింగులు తొలగించడానికి ఎందుకు ఆదేశాలివ్వడం లేదని, ఈసీ వాటిని తొలగించకపోతే తమ కార్యకర్తలు తొలగిస్తారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా తాము వ్యవహరించబోమని, ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. -
‘గాంధీ భవన్ పటేల్ రాజ్యంగా మారింది’
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నారయణరావు మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మొత్తం పటేల్ రాజ్యంగా మారిందని అన్నారు. అక్కడ బీసీలను, సీనియర్ నాయకులను తొక్కి పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. గాంధీ భవన్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టటమే తన ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందని, రాష్ట్రంలో 46 స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని జోష్యం చెప్పారు. బీసీలకు అన్యాయం చేయటం వల్లనే కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని పేర్కొన్నారు. స్వతంత్ర్య అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేశారా?
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కూని చేసిందని టీపీసీసీ నేత మల్లు రవి విమర్శించారు. శాసన సభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు అణిచివేస్తున్నారని, ఈ రోజు బ్లాక్ డే అని ఆయన అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బస్సు యాత్ర విజయవంతం కావడంతో సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో టీఆర్ఎస్ నేతలు ఈ నాటకాన్ని సృష్టించారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేస్తున్నా అక్కడ సభను వాయిదా వేశారే తప్ప ఇక్కడిలా సస్పెండ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్‌తో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా పరిరక్షణ దీక్ష చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ కార్యాలయాలవైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్, టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యాలయాలైన గాంధీభవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు శనివారం బోసిపోయి కన్పించాయి. ఆయా పార్టీల నేతలెవరూ ఆవైపు కన్నెత్తి చూడలేదు. నిత్యం వచ్చే నాయకులు కూడా ముఖం చాటేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించిన నేపథ్యంలో.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, టీడీపీల కార్యాలయాలు నేతలు లేక వెలవెల్లాడుతూ కన్పించాయి. గాంధీభవన్‌తో వద్ద కూడా కాంగ్రెస్ నేతల హడావుడి కన్పించలేదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పదిరోజులుగా ఢిల్లీకే పరిమితమయ్యారు. నిత్యం ఏదో ఒక అంశంపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సమావేశం ఏర్పాటు చేయించే చంద్రబాబు శనివారం అలాంటివేమీ వద్దని చెప్పడంతో టీడీపీ నేతలెవరూ ఆ వైపు రాలేదు. ఢిల్లీలోనే కాలం వెల్లబుచ్చుతున్న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా రాష్ట్రానికి రాలేదు. సీమాంధ్రలో దాదాపు 40 రోజులుగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చాలామంది ఎంపీలు, కేంద్ర మంత్రులు సెలవు దినాల్లో కూడా రాష్ట్రానికి రావడానికి సాహసించలేకపోయారు. ఇక ఏపీఎన్జీవోల భారీ బహిరంగసభ దృష్ట్యా పార్లమెంటు సమావేశాలు ముగిసినా.. శనివారం కూడా ఆ పార్టీల నేతలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. ఏపీఎన్జీవోలు ప్రధానంగా కేంద్ర మంత్రులు, ఎంపీల రాజీనామాల కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటే ఏదోఒకటి మాట్లాడాల్సి వస్తుందనే ఆందోళనతోనే ఆ నేతలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.