పార్టీ కార్యాలయాలవైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్, టీడీపీ నేతలు
Published Sun, Sep 8 2013 5:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యాలయాలైన గాంధీభవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లు శనివారం బోసిపోయి కన్పించాయి. ఆయా పార్టీల నేతలెవరూ ఆవైపు కన్నెత్తి చూడలేదు. నిత్యం వచ్చే నాయకులు కూడా ముఖం చాటేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించిన నేపథ్యంలో.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, టీడీపీల కార్యాలయాలు నేతలు లేక వెలవెల్లాడుతూ కన్పించాయి. గాంధీభవన్‌తో వద్ద కూడా కాంగ్రెస్ నేతల హడావుడి కన్పించలేదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పదిరోజులుగా ఢిల్లీకే పరిమితమయ్యారు. నిత్యం ఏదో ఒక అంశంపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయించే చంద్రబాబు శనివారం అలాంటివేమీ వద్దని చెప్పడంతో టీడీపీ నేతలెవరూ ఆ వైపు రాలేదు.
ఢిల్లీలోనే కాలం వెల్లబుచ్చుతున్న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా రాష్ట్రానికి రాలేదు. సీమాంధ్రలో దాదాపు 40 రోజులుగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చాలామంది ఎంపీలు, కేంద్ర మంత్రులు సెలవు దినాల్లో కూడా రాష్ట్రానికి రావడానికి సాహసించలేకపోయారు. ఇక ఏపీఎన్జీవోల భారీ బహిరంగసభ దృష్ట్యా పార్లమెంటు సమావేశాలు ముగిసినా.. శనివారం కూడా ఆ పార్టీల నేతలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. ఏపీఎన్జీవోలు ప్రధానంగా కేంద్ర మంత్రులు, ఎంపీల రాజీనామాల కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటే ఏదోఒకటి మాట్లాడాల్సి వస్తుందనే ఆందోళనతోనే ఆ నేతలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement