Ghanpur station
-
కడియం శ్రీహరికి గ్రీన్ సిగ్నల్..? ప్రగతిభవన్‌కు రాజయ్య..
సాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నారా? బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు అభయం ఇచ్చిందా? ఆ విషయం లీకై నందుకే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నేరుగా శ్రీహరిపై తీవ్ర పదజాలంతో ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారా? అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులే. ఒకరు టీడీపీలో.. మరొకరు కాంగ్రెస్‌లో.. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా.. వారిద్దరి మధ్యన ఎప్పుడు వైరమే. అధిష్టానం చొరవతో కలిసి పని చేసినట్లు కనిపించినా..ఎవరికి వారుగా ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు రెండు గ్రూపులకు ఆజ్యం పోయగా.. ఇప్పుడవి చినికి చినికి గాలివానగా మారాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు పార్టీని అభాసుపాలు చేస్తున్నాయి. శ్రీహరి దూకుడు వెనుక మర్మం ఏమిటి.. రూ.10 లక్షల వెనుక నిజమెంత? ఎమ్మెల్సీగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్న కడియం శ్రీహరి ఇటీవల మరింత దూకుడు పెంచడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివాదాలు ఎదుర్కొంటున్న సమయంలో అధిష్టానం శ్రీహరి వైపు మొగ్గు చూపుతోందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలను ముమ్మరం చేసిన ఆయన ఫ్లెక్సీలు, హంగు ఆర్భాటాల కోసం మండలానికి రూ.10 లక్షలు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవల ఆరోపించారు కూడా. శ్రీహరి మండలానికి రూ.10 లక్షలు పంపిణీ చేశారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది. సీఎం పేషీకి ‘స్టేషన్’ వివాదం ప్రగతిభవన్‌కు రాజయ్య.. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల పోరు సీఎం కేసీఆర్ పేషీకి చేరింది. ఎమ్మెల్యే తాటికొండ రాజ య్యకు ప్రగతిభవన్ నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. ఉదయమే ఖరారు చేసిన కార్యక్రమాలను రద్దు చేసుకుని వెళ్లిన ఆయన కేటీఆర్‌ను కలిశా రు. సుమారు గంట తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో సమస్య సద్దుమణిగిందన్నారు. అన్ని విషయాలు వివరించగా పార్టీ లైన్లో పనిచేయమని కేటీఆర్ ఆదేశించారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా కడియం శ్రీహరి ఇలాగే వ్యవహరించారని, తాను కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖను దాటన ని రాజయ్య పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదు, ప్రజనాయకుడనన్న రాజయ్య కొన్ని పరిణామాల దృష్ట్యా కడియం శ్రీహరిపై ఎదురు దాడి చేశానన్నారు. కడియం శ్రీహరిపై చేసినవి అభియోగాలు మాత్రమేనని, తాను కొత్త అభియోగాలు చేయలేదు, పాతవాటినే.. ఉటంకించాననీ సమర్థించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం
స్టేషన్ ఘన్పూర్: హన్మకొండ నుంచి ఉప్పల్‌కు వెళ్తున్న వరంగల్–1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఫ్లైఓవర్ ఎక్కిన బస్సు నెమ్మదిగా వెళ్తుంటే డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. అప్పటికే బస్సు వెనుక వైపు ఉండే ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వస్తున్నాయి. వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు పొగ వాసన రావడంతో డ్రైవర్‌కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించాడు. అప్పటికే బస్సులో మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది. వాటర్ ట్యాంకర్ తెప్పించి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే క్యాబిన్, సీట్లు, ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. అదే సమయంలో రాఘవాపూర్‌కు చెందిన తోట శ్రీకాంత్ బైక్ బస్సు పక్కనే ఉండటంతో పాక్షికంగా దగ్ధమైంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత పాలకుర్తి ఫైర్ ఇంజన్ ప్రమాదస్థలానికి చేరుకుంది. అనంతరం జనగామ నుంచి మరో ఫైర్ ఇంజన్ వచ్చింది. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. -
వినూత్న తీర్పునకు c/o స్టేషన్‌ఘన్‌పూర్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్/చిల్పూరు: అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునకు పెట్టింది పేరు స్టేసన్‌ఘన్‌పూర్. ఇక్కడి ఓటర్లు మార్పును కోరుకోవడంలో ముందుంటారు. వినూత్నమైన తీర్పులతో అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వాన్ని చిక్కుముడిలో పడేస్తుంది. నియోజకవర్గం 1957లో ఏర్పడగా 1978 లో ఎస్సీకి రిజర్వ్ అయింది. అప్పటి నుంచి ప్రతిసారి ఓటర్లు తమదైన శైలిలో తీర్పును ఇస్తున్నారు. ఇక్కడ నుంచి గెలిచిన పలువురు రాష్ట్రంలో కీలక శాఖల్లో మంత్రులుగా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచిన గోక రామస్వామి, కడియం శ్రీహరి, గుండె విజయరామారావు, డాక్టర్ రాజయ్య మంత్రి పదవులను చేపట్టారు. స్థానికేతరులకు అవకాశం.. 1957 నుంచి 1999 వరకు స్థానికేతరులకే అవకాశం ఇచ్చారు. పలువురు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుపొందారు. అందులో గోకా రామస్వామి కాంగ్రెస్ నుంచి 1978, 1983లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 1994, 1999 సాధారణ ఎన్నికలు, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి మూడుసార్లు గెలుపొంది మంత్రి పదవులను చేపట్టారు. పునర్విభజనతో స్థానికులకు.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం స్థానికుడైన డాక్టర్ రాజయ్యకు ప్రజలు అవకాశం కల్పించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి, 2014లో సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రాజయ్య వరుసగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన రాజయ్యకు 1,34,089 ఓట్లు, కాంగ్రెస్ నుంచి గుండె విజయరామారావుకు 44,802 ఓట్లు, టీడీపీ నుంచి పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్యకు 20,426 ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమ ఊపు ఉండడమే కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి రావడంతో రాజయ్యకు మంచి మెజార్టీ దక్కింది. బరిలో 8 మంది.. ప్రస్తుతం ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 8 మంది ఉన్నారు. ప్రధాన పారీలైన టీఆర్ఎస్ నుంచి డాక్టర్ తాటికొండ రాజయ్య, మహాకూటమి నుంచి సింగపురం ఇందిర, బీఎస్పీ నుంచి రాజారపు ప్రతాప్, బీజేపీ నుంచి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. త్రిముఖ పోటీ.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ రాజయ్య, కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర, బీఎస్పీ అభ్యర్థి రాజారపు ప్రతాప్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. తాటికొండ రాజయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి బలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో పట్టున్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెన్నంటి ఉండడం తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి రావడం బలహీనతలు అవినీతి ఆరోపణలు రావడం ప్రతీ పనికి కమీషన్ తీసుకుంటాడనే దుష్ప్రచారం ఇటీవల రాజయ్య రాసలీలలు అంటూ ఓ ఆడియో టేప్ వైరల్‌గా మారడం కడియం వర్గీయులు రాజయ్యకు టికెట్ రావడంపై సంతృప్తిగా ఉండడం మండల స్థాయి ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సింగపురం ఇందిర, ప్రజాకూటమి అభ్యర్థి బలాలు నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేనప్పటికీ రాజయ్యకు చెల్లెలు వరుస కావడం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, రాజయ్యపై వ్యతిరేకతే బలం మొదటి నుంచి ఇక్కడ మహిళా ఎమ్మెల్యే లేకపోవడంతో మహిళల నుంచి ఆమెకు మంచి ఆదరణ బలహీనతలు కేవలం ఎన్నికల సమయంలో తెరపైకి రావడం స్థానికంగా ఉండదని, సమస్యలను పట్టించుకోదని ప్రచారం ఎన్నికలు సమీపిస్తున్న ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో వెళ్లకపోవడం రాజారపు ప్రతాప్, బీఎస్పీ అభ్యర్థి బలాలు మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండడం గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం ప్రస్తుతం ఆరెండు పార్టీల నుంచి పరోక్షంగా సపోర్ట్ అన్నింటికి మించి మంచి పేరు ఉండడం దానికి తోడు కడియం శ్రీహరి వర్గీయుల అనుకూలం బలహీనతలు బీఎస్పీ పార్టీ, ఆగుర్తు ఇక్కడ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడం అంతేకాకుండా టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేస్తే బావుండేదని ఓటర్ల ఆలోచన బీఎస్పీలోకి వెళ్లడం సరికాదని బహిరంగ చర్చ నియోజకవర్గ ఓటర్లు మొత్తం ఓటర్లు 2,25,616 పురుషులు 1,12,968 మహిళలు 1,12,645 ఇతరులు 3 -
డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ
స్టేషన్లో చిచ్చు డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ఆధిపత్య పోరు అధికారులకుసంకటంగా మారిన పరిస్థితి లింగాలఘణపురం : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు తమ వెంట ఉండే ద్వితీయ శ్రేణి నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో వివాదాలు ఉండేవి. తాజాగా ప్రభుత్వ పథకాలు, పరిపాలన అంశాల్లో కూడా పోరు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి మార్పు తర్వాత తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సహించేదిలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య పదేపదే ప్రకటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఇదే జరిగింది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను సన్న, చిన్నకారు రైతులకు అందిస్తోంది. ఇటీవల జిల్లాకు 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వ్యవసాయశాఖలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, మహబూబాబాద్, మరిపెడ, నర్సంపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ మండలాలకు సగటున రెండు చొప్పున కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ట్రాక్టరుపై గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. నిబంధనల ప్రకారం.. ఆయా గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి సర్పంచ్, ఎంపీటీసీ.. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏవోల ఆమోదంతో సబ్సిడీ పరికరాల పంపిణీ ప్రాధాన్యత కల్పించాలి. మరో ఉదాహరణ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మండలాలకు రెండు చొప్పున ట్రాక్టర్లు కేటాయించారు. తనకు దగ్గరగా ఉండే ఒక రైతుకు సబ్సిడీ ట్రాక్టర్ పంపిణీ అయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సిఫారసు లేఖ ఇచ్చారు. పథకానికి సంబంధించి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నట్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలతోనూ సంతకాలు చేసి ఆమోదం తెలిపారు. ఇక రేపోమాపో ట్రాక్టర్ వచ్చేస్తుందనే ధీమాతో దరఖాస్తు చేసుకున్న రైతు ఓ ట్రాక్టర్ కంపెనీ యజమానిని వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. విషయం తెలిసిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఆగ్రహం ఆ దరఖాస్తును వెనక్కి తీసుకరావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మధ్య అధికార యంత్రాంగం బిక్కుబిక్కుమంటున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. సబ్సిడీ ట్రాక్టర్లకు సంబంధించి మార్చి 30లోగా లబ్ధిదారుల ఎంపిక చేసి పంపిణీ పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో తాము ఏం చేసే పరిస్థితి లేదని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని రైతులకు కనీసం సమాచారం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించిన జాండీర్, సుబోటో, న్యూహోలాండ్, ఎస్కర్ట్ కంపెనీల షోరూం యజమానులకు మాత్రమే ఈ పథకంపై సమాచారం ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కేటాయింపులో సిఫారసులు చేస్తుండడంతో అర్హులైన ఎందరో రైతులకు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలియడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాల ఉద్దేశం నెరవేరడం లేదు.