సాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నారా? బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు అభయం ఇచ్చిందా? ఆ విషయం లీకై నందుకే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నేరుగా శ్రీహరిపై తీవ్ర పదజాలంతో ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారా? అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులే. ఒకరు టీడీపీలో.. మరొకరు కాంగ్రెస్‌లో.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్నా.. వారిద్దరి మధ్యన ఎప్పుడు వైరమే. అధిష్టానం చొరవతో కలిసి పని చేసినట్లు కనిపించినా..ఎవరికి వారుగా ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు రెండు గ్రూపులకు ఆజ్యం పోయగా.. ఇప్పుడవి చినికి చినికి గాలివానగా మారాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు పార్టీని అభాసుపాలు చేస్తున్నాయి.
శ్రీహరి దూకుడు వెనుక మర్మం ఏమిటి.. రూ.10 లక్షల వెనుక నిజమెంత?
ఎమ్మెల్సీగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్న కడియం శ్రీహరి ఇటీవల మరింత దూకుడు పెంచడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివాదాలు ఎదుర్కొంటున్న సమయంలో అధిష్టానం శ్రీహరి వైపు మొగ్గు చూపుతోందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలను ముమ్మరం చేసిన ఆయన ఫ్లెక్సీలు, హంగు ఆర్భాటాల కోసం మండలానికి రూ.10 లక్షలు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవల ఆరోపించారు కూడా. శ్రీహరి మండలానికి రూ.10 లక్షలు పంపిణీ చేశారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది.
సీఎం పేషీకి ‘స్టేషన్’ వివాదం ప్రగతిభవన్‌కు రాజయ్య..
ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల పోరు సీఎం కేసీఆర్ పేషీకి చేరింది. ఎమ్మెల్యే తాటికొండ రాజ య్యకు ప్రగతిభవన్ నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. ఉదయమే ఖరారు చేసిన కార్యక్రమాలను రద్దు చేసుకుని వెళ్లిన ఆయన కేటీఆర్‌ను కలిశా రు. సుమారు గంట తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో సమస్య సద్దుమణిగిందన్నారు. అన్ని విషయాలు వివరించగా పార్టీ లైన్‌లో పనిచేయమని కేటీఆర్ ఆదేశించారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా కడియం శ్రీహరి ఇలాగే వ్యవహరించారని, తాను కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖను దాటన ని రాజయ్య పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదు, ప్రజనాయకుడనన్న రాజయ్య కొన్ని పరిణామాల దృష్ట్యా కడియం శ్రీహరిపై ఎదురు దాడి చేశానన్నారు. కడియం శ్రీహరిపై చేసినవి అభియోగాలు మాత్రమేనని, తాను కొత్త అభియోగాలు చేయలేదు, పాతవాటినే.. ఉటంకించాననీ సమర్థించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment