ghanta srinivasa rao
-
మిస్ వైజాగ్ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ
-
మిస్ వైజాగ్ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ
-
వైజాగ్ అందాలపై ఆందోళన
సాక్షి, విశాఖపట్నం : మిస్ వైజాగ్ అందాల పోటీల వివాదం తారాస్థాయికి చేరుకుంది. నేటి సాయంత్రం ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో పోటీలను అడ్డుకునేందుకు మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఈ ఏడాదికి గానూ నిర్వాహకులు 26 మంది యువతులను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫైనల్స్ పోటీ నిర్వహించబోతున్నారు. దీనికి మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు గంటాను కలిసి పోటీలను రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు పోటీలకు వెళ్లొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి మాత్రం అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతాననటం గమనార్హం. మిస్ వైజాగ్ పోటీలపై ప్రారంభం నుంచే వివాదాలు నెలకొన్నాయి. పోటీల ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో కూడా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించినప్పటికీ.. ఎలాంటి స్పందన లేకుండా పోయిందని మహిళా సంఘాలు వాపోతున్నాయి. అత్యాచారాలు జరిగినపుడు నిందితులను చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, మహిళలపై నిరంకుశ విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన మంత్రి ఆధ్వర్యంలోనే అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటని వారంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహణను అడ్డుకుని తీరతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నట్లు సమాచారం. -
ఎట్టకేలకు డీఎస్సీ !
సాక్షి, చిత్తూరు: ఎట్టకేలకు నాలుగు వాయిదాల అనంతరం ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు సన్నదమైంది. డీఎస్సీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేసింది మే 9,10,11 తేదీల్లో డీఎస్సీకి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమరుుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది బీఈడీ, డీఈడీతో పాటు లాంగ్వేజ్ పండిట్స్ తదితరులు డీఎస్సీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. తాజాగా గురువారం విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి తేదీలను ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠకు తెరపడింది. చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్‌కు సంబంధించి 221 పోస్టులు ఖాళీగా ఉండగా, సెకెండరీ గ్రేడ్‌కు సంబంధించి 1194 పోస్టులున్నాయి. ఇంకా లాంగ్వేజ్ పండిట్స్ 182 ఉండగా, పీఈటీలకు సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 1606 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 30 బీఈడీ కళాశాలలు, 48 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏడాదికి 15వేలకు పైచిలుకు విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. రెండు సంవత్సరాలుగా డీఎస్సీ జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 నుంచి 40వేల మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. మాట మార్చిన విద్యాశాఖ మంత్రి ఎన్నికల సమయంలో డీఎస్సీకి సంబంధించి బీఈడీ, డీఈడీ అన్న తేడా లేకుండా అందరికీ అర్హత కల్పిస్తామని బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని ప్రకటించిన మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఆ తరువాత మాట మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన మంత్రి ఐదు నెలలు దాటుతున్నా ఆ పని చేయలేదు. టెట్ లేకుండా చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పడెమో టెట్ కాకుండా తాజాగా ఉమ్మడి పరీక్షా విధానంతో డీఎస్సీ నిర్వహిస్తామని ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామంటూ కొత్తగా ప్రకటిస్తున్నారు. చివరికి ఏమీ చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. -
లెహర్‌పై ముందస్తు చర్యలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: లెహర్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఉదయం కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, వుడా వీసీ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ వెంకట మురళితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగా తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తుపాను నేపథ్యంలో చేపడుతున్న చర్యలను మంత్రికి కలెక్టర్ వివరించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నేవీ సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామన్నారు. డార్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయని, వాటిని పాయకరావుపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి, నక్కపల్లి, మునగపాక మండలాలతో పాటు విశాఖ నగరానికి కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సర్వ సన్నద్ధంగా ఉంచామన్నారు. బుదవారం నుంచి మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారులు తుపాను పరిస్థితిని సమీక్షిస్తుంటారని తెలిపారు. -
ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి వికలాంగుల ఆటల పోటీలు మంగళవారం నిర్వహించారు. ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు మార్చ్‌పాస్ట్ అనంతరం గౌరవ వందనాన్ని సమర్పించి జాతీయ గీతాన్ని అలపించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలోని 23 ప్రత్యేక పాఠశాలలకు చెందిన వికలాంగ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వందర మీటర్ల పరుగుతో పోటీలు ఆరంభమయ్యాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో రన్నింగ్, షాట్‌పుట్, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు నర్సింహులు, అదనపు జాయింట్ కలెక్టర్ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.