విశాఖపట్నం, న్యూస్‌లైన్: లెహర్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఉదయం కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, వుడా వీసీ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌డీఓ వెంకట మురళితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగా తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తుపాను నేపథ్యంలో చేపడుతున్న చర్యలను మంత్రికి కలెక్టర్ వివరించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నేవీ సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామన్నారు. డార్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధంగా ఉంచామన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయని, వాటిని పాయకరావుపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి, నక్కపల్లి, మునగపాక మండలాలతో పాటు విశాఖ నగరానికి కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సర్వ సన్నద్ధంగా ఉంచామన్నారు. బుదవారం నుంచి మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారులు తుపాను పరిస్థితిని సమీక్షిస్తుంటారని తెలిపారు.
లెహర్‌పై ముందస్తు చర్యలు
Published Wed, Nov 27 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement