విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ తుపా నుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇతర సహాయక బృందాలను రంగంలోకి దింపింది. కలెక్టరేట్‌లో 1800-4250-0002 టోల్‌ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి హర్‌ప్రీత్‌సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరంలోని 11 మండలాలకు పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు.
జనం రోడ్లమీదకు రాకూడదు అత్యంత వేగంగా వస్తున్న లెహర్ తుపాను
ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల మేరకు గాలులు వీస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీదకు రావడం శ్రేయస్కరం కాదని అధికారులు సూచిస్తున్నారు. ఆ రోజున జిల్లావాసులు ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొంటున్నారు.
నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ
తుపాను తీరం దాటే 28న రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా ప్రజా రవాణా వ్యవస్థను పరిమితంగా నడపాలని ఆయా శాఖల అధికారులు నిర్ణయించారు. ఆ రోజున పరిస్థితులను బట్టి బస్సులను పరిమితంగా నడపడం, లేకుంటే పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇటీవల వచ్చిన పై-లీన్, అల్పపీడనం, హెలెన్ తుపానుల సమయంలో రైళ్లు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. లెహర్ ప్రభావం వాటి కంటే తీవ్రంగా ఉండనుండటంతో ఆ రోజున రైళ్లను ముందుగానే రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ దీనిపై తూర్పుకోస్తా డీఆర్‌ఎంతో చర్చించారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలలో రైల్వే ట్రాఫిక్‌పై ముందస్తుగా దృష్టి సారించాలని కోరారు. దీంతో ఆ రోజు కొన్ని రైళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడే సూచనలు ఉన్నాయి.
55 గ్రామాలు తరలింపు
తుపాను నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలుగా గుర్తించిన 55 గ్రామాలను తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి 40 వేల మందిని 71 పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. అధికార బృందాలు బుధవారం ఉదయం నుంచి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఇందుకోసం వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
సహాయక చర్యలకు భద్రతా దళాలు
లెహర్ తుపానుకు సహాయ చర్యలు చేపట్టేందుకు మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకు భద్రతా దళాలు చేరుకుంటున్నాయి. 120 మంది సభ్యులతో కూడిన ఆర్మీ బృందాన్ని కేంద్రం జిల్లాకు పంపించింది. అలాగే 20 నేవీ బృందాలతో పాటు, ఒడిశా నుంచి 4 ఎన్‌డీఆర్‌ఎఫ్ టీములు ఇప్పటికే చేరుకున్నాయి. మరో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం రానున్నాయి. అత్యవసర పరిస్థితులకు డార్నియర్ ఎయిర్‌క్రాాఫ్ట్‌ను సిద్ధంగా ఉంచారు. ఈ బృందాలను పాయకరావుపేట, యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి, విశాఖ నగరానికి కేటాయిస్తున్నారు. వీరితో పాటు 20 ఫైర్‌మెన్ బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి.
పాఠశాలలు, కాలేజీలు సెలవు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 28న పాఠశాలలతోపాటు కళాశాలలకూ కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సెలవు ప్రకటించారు. ఆ రోజున నిర్వాహకులు తరగతులను నిర్వహించకూడదని సూచించారు.
నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ
Published Wed, Nov 27 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement