ఆ 'మిఠాయి' దుకాణం శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ : ఆ మిఠాయి షాపులో తయారైన జిలెబి అంటే భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయికి మహా ఇష్టం... మరో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి అయితే ఆ షాపుకు వెళ్లి మరీ మిఠాయి కొనుగోలు చేసేవారు. ప్రముఖ గాయకుడు మహ్మమద్ రఫీ అయితే కారులో వచ్చి మరీ మిఠాయిని కొని ఇంటికి కొనుక్కోని తీసుకెళ్లేవారు. ఇక దీపావళి పండగ వచ్చిందంటే.. షాపులో మిఠాయి కొనుక్కోనేందుకు నగరవాసులు కిలోమీటర్ల మేర బారులు తీరే వారు. వారిని నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చేంది. అంత పేరు పొందిన మిఠాయి షాపు బుధవారం రాత్రి శాశ్వతంగా మూతపడింది.
దేశ రాజధాని హస్తినలోని చాందినీ చౌక్‌లో అత్యంత పురాతనమైన ఘంటేవాలా మిఠాయి షాపు మూతపడింది. ఈ షాపుకు ఘనమైన చరిత్ర ఉంది. 1790లో ఢిల్లీని మొఘల్ వంశానికి చెందిన రాజు షా అలం -2 పరిపాలిస్తున్న రోజుల్లో ఈ మిఠాయి షాపును ప్రారంభించారు. దాదాపు 225 ఏళ్ల పాటు 8 తరాల పాటు తమ కుటుంబ సభ్యులు ఈ షాపును నడిపారు.... అలాంటి షాపును మూసివేస్తున్నట్లు తెలియజేయడాన్ని తనకు చాలా కష్టంగా ఉందని ఆ షాపు అధిపతి సుశాంత్ జైన్ ఫోన్లో వెల్లడించారు.
పర్యాటకులను ఈ స్వీట్ షాపు అయస్కాంతంలా ఆకర్షించేదని... విదేశీ పర్యాటకులైతే ఈ షాపు ముందు మరీ సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడే వారని పక్కనే ఉన్న బట్టల షాపు ఓనర్ అశోక్ అరోరా గుర్తు చేసుకున్నారు. షాపుకు ఘంటేవాలా అనే పేరు రావడంపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నా... క్లాక్ టవర్‌కు దగ్గరగా ఉండటం వల్లే ఆ పేరు వచ్చిందని అరోరా చెప్పారు.
చాందీని చౌక్‌లో రెండు ఘంటేవాలా మిఠాయి షాపులుంటే.. ఫౌంటేన్ షాపు సమీపంలోని ఘంటేవాలా షాహీ హల్వా మిఠాయి షాపును కొన్ని ఏళ్ల క్రితం మూసివేశారు. మరోకటి అదే ప్రాంతంలో రోడ్డుకు అటుపక్కనే ఉంది. దాన్ని ఇద్దరు అన్నదమ్ములు ఏర్పాటు చేసిన వారిలో ఒకరు తన వాటాను సుశాంత్‌కు విక్రయించాడు. సుశాంత్ నడుపుతున్న ఘంటేవాలా షాపులో గత దశాబ్ద కాలంగా విక్రయాలు బాగా తగ్గిపోయాయి. దీంతో షాపును మూసివేయాలని యాజమానులు నిర్ణయించారు. 1954లో మీనా కుమారి హీరోయిన్గా నటించి ఓ చిత్రం ఈ షాపు ముందే షూటింగ్ జరుపుకుంది.