నగరానికే హీరో ఈ వెంకటయ్య
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు వెంకటయ్యకు జాతీయస్థాయిలో లభించిన అత్యున్నత పురస్కారం జీహెచ్ఎంసీ కార్మికులందరికీ వర్తిస్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లో పనిచేస్తున్న వెంకటయ్యను బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెంకటయ్యను ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో విధుల్ని నిర్వహించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు,సిబ్బందిని ప్రోత్సహించేందుకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులు అందజేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ పురస్కారం హైదరాబాద్ నగరానికి లభించిన పురస్కారంగా పరిగణిస్తున్నామన్నారు. వెంకటయ్యకు డ్యూక్ బిస్కెట్ కంపెనీ యాజమాన్యం రూ. 25వేల నగదును అందజేయగా, అవార్డు అందుకునేందుకు న్యూఢిల్లీ వెళ్లేందుకు మైలార్దేవులపల్లి కార్పొరేటర్ విమాన ప్రయాణ చార్జీలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వెంకటయ్యను శాలువ, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, కెనెడి, శంకరయ్య, భాస్కరాచారి, సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ కార్మికులను సన్మానించండి
ప్రతినెల మొదటి శనివారం నిర్వహిస్తున్న గుడ్ ప్రాక్టీసెస్డేలో భాగంగా క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే పారిశుధ్య కార్మికులు, ఎస్ఎఫ్ఏలు, ఇతర ఉద్యోగులను గుర్తించి సన్మానించడం ద్వారా వారిని ప్రోత్సహించాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల అమలుపై బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 15 లోగా సర్కిళ్లలో గరిష్ట స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.