GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో చోటు చేసుకున్న కృత్రిమ వేలిముద్రల వ్యవహారాన్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పని చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది? ఇంకా ఎందరి పాత్ర ఉంది? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
గోషామహల్ సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండే పారిశుద్ధ్య కార్మికుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వారి హాజరును తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఒక్కో కార్మికుడికీ నిర్దేశిత పని వేళలు ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్‌లో లాగ్ ఇన్, పూర్తయ్యాక లాగ్ ఔట్ నిర్దేశిస్తూ వీళ్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది.
దీన్ని గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీరిని ప్రతి రోజూ ఫీల్డ్‌లోకి తీసుకువెళ్లడం, అక్కడే వారితో వేలిముద్రలు వేయించి హాజరు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో కృత్రిమ వేలిముద్రలు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. యూ ట్యూబ్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఫెవికాల్, ఎంసీల్ తదితరాలు కలపడం ద్వారా ఓ రకమైన సింథటిక్ పదార్థం తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు.
వీటిని తమ జేబులో వేసుకుని ఫీల్డ్‌కు వెళ్తున్న ఉద్యోగులు అదును చూసుకుని లాగ్ ఇన్, లాగ్ ఔట్ కోసం వీటితో వేలిముద్రలు వేసేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు స్కామ్ గుట్టరట్టు చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై స్పష్టత వస్తుందని, ఆపై అందరినీ అరెస్టు చేస్తామని టాస్క్‌ఫోర్స్ అధికారులు
చెబుతున్నారు.