డిసెంబర్లో ముహూర్తం?
జీహెచ్ఎంసీ ఎన్నికలకు{పభుత్వం సన్నాహాలు
ఈసీని కోరుతామని ైహ కోర్టుకు నివేదన
డివిజన్ల విభజనకు 249 రోజులు కావాలని వినతి
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉందా?... ఈ ప్రశ్నకు అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎన్నికల జాప్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం మరోమారు విచారణ చేపట్టింది. డివిజన్ల పునర్విభజన, బీసీల గణన, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసి... డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరుతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ తేదీని తెలియజేయాలని హైకోర్టు గత విచారణ సమయంలో ఆదేశించడంతో పాటు... సోమవారం (మార్చి 30 వ తేదీ)లోగా ఆ వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో తామే తేదీని ప్రకటించి... ఆమేరకు అవసరమైన చర్యలు చేపడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. డివిజన్ల విభజనకు అవసరమైన వివిధ ప్రక్రియలు పూర్తి చేసేందుకు తమకు 249 రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
వచ్చే డిసెంబర్ రెండోవారంలో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరతామని నివేదించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తెలిపిన మేరకు డిసెంబర్ రెండో వారంలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అంగీకరిస్తుందా? లేక అంతకన్నా ముందే నిర్వహించాలని ఆదేశిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు ప్రస్తుతం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం కోసం పని చేస్తున్నారు. మంగళవారంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. దీంతో పన్ను వసూళ్లకు బ్రేక్ పడుతుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అధికారులు వార్డుల పునర్విభజన పనిలో పడనున్నారు. ఇప్పటికే దానిపై ఒక అంచనాకు వచ్చిన అధికారులు తగిన విధివిధానాలతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.