Gilakaladindi
-
రెండేళ్లలో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లా గిలకలదిండి వద్ద రూ.348 కోట్లతో చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ రెండో దశ పనులను రెండేళ్లలో పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. హార్బర్ అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిలకలదిండి వద్ద ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేయాలని మత్స్యకారులు 2009 నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, జెట్టీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గిలకలదిండి హార్బర్ అభివృద్ధిలో భాగంగా 14 అడుగుల లోతున, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వటం జరుగుతుందని, తద్వారా రాబోయే యాభై ఏళ్ల వరకు మత్స్యకారులకు చేపలవేటకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. సముద్ర మొగకు దక్షిణం వైపునున్న కృష్ణానది సిల్ట్ కారణంగా త్వరగా ఇసుకమేట వేసేస్తోందని, దీన్ని నివారించేందుకు 1,150 మీటర్ల పొడవైన గోడ నిర్మిస్తామన్నారు. హార్బర్లో 500 బోట్లు నిలబెట్టేందుకు వీలుగా 790 మీటర్ల ‘కే’ వాల్ నిర్మిస్తామన్నారు. బందరు ప్రాంత మత్స్యకారుల అభివృద్ధి కోసం పెద్దమనసుతో నిధులు కేటాయించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ చైర్పర్సన్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ తీరుపై భగ్గుమన్న గిలకలదిండి పేదలు
మచిలీపట్నం: పేదల ఇళ్ల స్థలాలు కోసం ఎంపిక చేసిన భూమిపై టీడీపీ నాయకులు తప్పుడు కేసులు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మచిలీపట్నం గిలకలదిండి గ్రామస్తులు మంగళవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం సంబంధిత భూమిలో స్థానిక పేదలు పిల్లాపాపలతో కలిసి బైఠాయించారు. వివరాల్లోకి వెళితే.. ► మచిలీపట్నం శివారు గిలకలదిండి గ్రామానికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. లోతట్టుగా ఉన్న ఆ స్థలాన్ని ఎత్తు చేసే పనులు కొనసాగుతున్నాయి. ► గిలకలదిండికి చెందిన సుమారు 1,100 కుటుంబాలకు ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే జాబితా సిద్ధమైంది. తాజాగా ప్లాట్లుగా విభజించే పనులు జరుగుతున్నాయి. ► అయితే, ఆ భూమిలో మడ అడవులున్నాయని, దీనివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కోర్టును ఆశ్రయించి.. ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే తెచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులై ఆందోళనకు దిగారు. ► నిరుపేదలకు స్థలాలు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ► అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోని రవీంద్ర ఇప్పుడు ప్రభుత్వ పథకాలేవీ అందకుండా కుట్రలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ► సమాచారం అందుకున్న తహసీల్దార్ సునీల్‌బాబు రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ► అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, పేదలకు తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. ► ఆ భూమి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించే నిమిత్తం డ్రోన్ కెమేరాతో ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు. ► గిలకలదిండి వద్ద ఎంపిక చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని, వాటిపై స్టే ఇచ్చినట్లుగా న్యాయస్థానం నుంచి తమకెలాంటి పత్రాలు అందలేదని తహసీల్దార్ సునీల్‌బాబు మీడియాకు తెలిపారు. -
సముద్రంలో బోటు మునక
సాక్షి, మచిలీపట్నం సబర్బన్: మచిలీపట్నం గిలకలదిండి హార్బర్‌కి చెందిన మెకనైజ్డ్ బోటు సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. బోటు యజమాని తమ్ము ఏలేశ్వరరావుకు వారం కిందట నలుగురు కలాసీలతో కలసి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం బోటును నరసాపురం తీరంలో ఉంచారు. శనివారం రాత్రి బోటును మచిలీపట్నం తీరానికి తీసుకొస్తుండగా మార్గ మధ్యలోని కృత్తివెన్ను మండలం, ఒర్లగొందితిప్ప తీరంలో బోటు అడుగు భాగాన ఆకస్మాత్తుగా రంధ్రం ఏర్పడి బోటులోకి నీరు చేరినట్లు మత్య్సశాఖ ఏడీ గణపతి తెలిపారు. ఒర్లగొందితిప్ప సముద్ర తీరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. బోటులో సుమారు రూ.లక్ష విలువ చేసే వలలతో ఇతర వేట సామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి. ఊహించని ప్రమాదంలో బోటుతో పాటు నీట మునిగిన యజమాని ఏలేశ్వరరావు, నలుగురు కలాసీలను సమీపంలో ఉన్న బోటు సిబ్బంది రక్షించారు. ఈ ప్రమాదంలో బోటు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పూర్తిగా బోల్తా పడి నీటిలో మునిగిన బోటును ప్రస్తుతం వేరే బోటు సహాయంతో మచిలీపట్నం గిలకలదిండి తీరానికి తరలిస్తున్నారు. బోటు విలువ రూ.10 లక్షలు ఉంటుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం మెకనైజ్డ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు లంకే వెంకటేశ్వరరావు ఘటనపై ఆరా తీశారు. -
పూడికతీత ఎప్పటికో..
గిలకలదిండి హార్బర్ సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేట రోజులో గంట మాత్రమే బోట్లు వెళ్లేందుకు అవకాశం పూడికతీసి 30 సంవత్సరాలు అమలుకు నోచుకోని మంత్రి హామీ మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిలకలదిండి హార్బర్లో సముద్రముఖ ద్వారం వద్ద పూడిక మేటవేసింది. ముఖద్వారం కనీసం 10 నుంచి 12అడుగుల లోతు ఉండాల్సి ఉండగా, ఒకచోట ఐదు అడుగులు, పక్కనే మరోచోట అడుగు లోతు మాత్రమే ఉంటోంది. దీంతో మత్స్యకారుల బోట్లు దెబ్బతింటున్నాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని బోటు యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లోతు ఎక్కడో తెలియదు.. గిలకలదిండి హార్బర్ నుంచి అధికారిక లెక్కల ప్రకారం వందకు పైగా మెకనైజ్డ్ బోట్లు, 60కి పైగా పెద్ద ఫైబర్‌బోట్లు చేపలవేటకు వెళ్లి వస్తుంటాయి. అనధికారికంగా మరో 100 వరకు మెకనైజ్డ్, పెద్ద ఫైబర్ బోట్లు చేపలవేట కొనసాగిస్తున్నాయి. ఈ బోట్ల నుంచి సాగించే వేట వల్ల వచ్చే మత్స్య సంపద ద్వారా రోజూ లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయితే చేపలవేటకు వెళ్లి రావాలంటే హార్బర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర కాలువలో ప్రయాణించాలి. ఆ తర్వాత సముద్ర ముఖద్వారం వస్తుంది. ఇక్కడే అసలు సమస్య మేటవేసింది. ముఖద్వారం వద్ద ఇసుక మేట వేయటంతో ఎక్కడ సముద్రం లోతుగా ఉంది.. ఎక్కడ మెరకగా ఉంది.. అనే విషయం తెలియడం లేదు. ఎవరైనా డ్రైవర్ లోతును అంచనా వేయలేక బోటును ముందుకు నడిపితే మేట వద్ద చిక్కుకుపోతోంది. సముద్రం నుంచి వచ్చే అలలు ఈ బోటును బలంగా తాకటంతో అది పగిలిపోతోంది. గత నాలుగు నెలల వ్యవధిలో నాలుగు మెకనైజ్డ్ బోట్లు ముఖద్వారం వద్ద చిక్కుకుని పాడైపోయాయి. ఈ బోట్లలోని వలలను మినహాయిస్తే ఒక్కో బోటులో ఉన్న యంత్రాలు, సౌకర్యాలను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల విలువ ఉంటుందని బోటు యజమానులు చెబుతున్నారు. మేట వేసిన ప్రాంతాల్లో బోట్లు చిక్కుకుపోతున్నాయని పలుమార్లు పాలకులకు, అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు. పూడిక తీసి 30 సంవత్సరాలు గిలకలదిండి హార్బర్‌కు సమీపంలో సముద్ర ముఖద్వారం వద్ద పూడికతీసి 30 సంవత్సరాలకు పైగా అయ్యిందని బోటు యజమానులు, స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సముద్ర ముఖద్వారాన్ని జిల్లాస్థాయి అధికారులు, ఓడరేవుల శాఖ ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. రూ.16 కోట్లతో ముఖద్వారంలో పూడికతీస్తామని ఆయన హామీ ఇచ్చారని మత్స్యకారులు చెబుతున్నారు. మూడేళ్లయినా ఆ హామీ అమలుకు నోచుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలల వెంబడి వచ్చిన ఇసుక బోట్లు వెళ్లే కాలువలో మేట వేస్తోంది. కాబట్టి గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లే కాలువకు కుడివైపున ముఖద్వారం నుంచి రెండు కిలోమీటర్ల మేర రాళ్లతో సముద్రంలోకి అడ్డుగోడ నిర్మిస్తే అలల తాకిడి తగ్గి ముఖద్వారం పూడుకుపోకుండా ఉంటుందని స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు చెబుతున్నారు. 24 గంటలు ఆగాల్సిందే.. సముద్రంలో ఆటు, పోటు వేళలు ప్రతి రోజు మారుతుంటాయి. పగటి సమయంలో సముద్రం పోటు వచ్చినప్పుడు గంట పాటు గిలకలదిండి హార్బర్ నుంచి బోట్ల రాకపోకలకు అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో సముద్రంలోనే రెండు కిలోమీటర్ల దూరంలో బోటుకు లంగరు వేసి మళ్లీ పోటు వచ్చే వరకు నిలిపివేస్తున్నారు. దీనివల్ల తుపానులు వచ్చినప్పుడు సముద్రంలో ఉన్న బోట్లు గిలకలదిండి హార్బర్‌కు త్వరగా చేరేందుకు అవకాశం లేకుండాపోతోందని బోటు యజమానులు వాపోతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఒడ్డుకు తీసుకురావాలంటే అష్టకష్టాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్నిసార్లు వేట ముగిసిన వెంటనే బయటకు రాలేకపోతున్నామని, ఆలస్యమైతే పెద్ద వ్యాపారులు చేపల కొనుగోలును పూర్తిగా నిలిపివేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు నిర్ణయించిన ధరకే చేపలను విక్రయించాల్సి వస్తోందని, ఒక్కో రోజు ఖర్చులు కూడా రావడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిలకలదిండి హార్బర్ నుంచి ముఖద్వారం వరకు డ్రెడ్జింగ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.