
మునిగిన బోటును వేరే బోటు సాయంతో మచిలీపట్నం తీరానికి తీసుకొస్తున్న దృశ్యం
సాక్షి, మచిలీపట్నం సబర్బన్: మచిలీపట్నం గిలకలదిండి హార్బర్‌కి చెందిన మెకనైజ్డ్ బోటు సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. బోటు యజమాని తమ్ము ఏలేశ్వరరావుకు వారం కిందట నలుగురు కలాసీలతో కలసి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం బోటును నరసాపురం తీరంలో ఉంచారు.
శనివారం రాత్రి బోటును మచిలీపట్నం తీరానికి తీసుకొస్తుండగా మార్గ మధ్యలోని కృత్తివెన్ను మండలం, ఒర్లగొందితిప్ప తీరంలో బోటు అడుగు భాగాన ఆకస్మాత్తుగా రంధ్రం ఏర్పడి బోటులోకి నీరు చేరినట్లు మత్య్సశాఖ ఏడీ గణపతి తెలిపారు. ఒర్లగొందితిప్ప సముద్ర తీరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. బోటులో సుమారు రూ.లక్ష విలువ చేసే వలలతో ఇతర వేట సామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి.
ఊహించని ప్రమాదంలో బోటుతో పాటు నీట మునిగిన యజమాని ఏలేశ్వరరావు, నలుగురు కలాసీలను సమీపంలో ఉన్న బోటు సిబ్బంది రక్షించారు. ఈ ప్రమాదంలో బోటు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. పూర్తిగా బోల్తా పడి నీటిలో మునిగిన బోటును ప్రస్తుతం వేరే బోటు సహాయంతో మచిలీపట్నం గిలకలదిండి తీరానికి తరలిస్తున్నారు. బోటు విలువ రూ.10 లక్షలు ఉంటుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం మెకనైజ్డ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు లంకే వెంకటేశ్వరరావు ఘటనపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment