శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం: కృష్ణా జిల్లా గిలకలదిండి వద్ద రూ.348 కోట్లతో చేపడుతున్న ఫిషింగ్ హార్బర్ రెండో దశ పనులను రెండేళ్లలో పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. హార్బర్ అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిలకలదిండి వద్ద ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేయాలని మత్స్యకారులు 2009 నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి, జెట్టీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
గిలకలదిండి హార్బర్ అభివృద్ధిలో భాగంగా 14 అడుగుల లోతున, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వటం జరుగుతుందని, తద్వారా రాబోయే యాభై ఏళ్ల వరకు మత్స్యకారులకు చేపలవేటకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. సముద్ర మొగకు దక్షిణం వైపునున్న కృష్ణానది సిల్ట్ కారణంగా త్వరగా ఇసుకమేట వేసేస్తోందని, దీన్ని నివారించేందుకు 1,150 మీటర్ల పొడవైన గోడ నిర్మిస్తామన్నారు. హార్బర్‌లో 500 బోట్లు నిలబెట్టేందుకు వీలుగా 790 మీటర్ల ‘కే’ వాల్ నిర్మిస్తామన్నారు. బందరు ప్రాంత మత్స్యకారుల అభివృద్ధి కోసం పెద్దమనసుతో నిధులు కేటాయించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ చైర్‌పర్సన్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment