ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.
పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.
పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.
‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.
తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.
కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.
టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
-ఎం.రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment