చల్లకొచ్చి ముంత దాచుకోవడం అనే సామెత ఒకటుంది. ఆ సామెత వెనుక ఓ బుల్లి కథ కూడా ఉంది. ఓ ఊళ్లో ఆదెమ్మ, సోదెమ్మ అనే ఇద్దరున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగువారే. ఆదెమ్మకు ఏదైనా అవసరం వస్తే మొహమాటమూ సిగ్గు లేకుండా సోదెమ్మను అడిగి పుచ్చుకుంటుంది. కానీ సోదెమ్మకు కాస్త సిగ్గు ఎక్కువ. ఓసారి సోదెమ్మకు చల్ల (మజ్జిగ) కావాల్సి వచ్చింది. ఇంట్లో నిండుకున్నాయి.
మొగుడికేమో మజ్జిగ చుక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకని వేరే గత్యంతరం లేక చేతిలో ఓ ముంత పట్టుకుని ఆదెమ్మ దగ్గరకు వెళ్లింది. ‘రా రా సోదెమ్మక్కా.. ఏంటి సంగతులు’ అని అడిగింది ఆదెమ్మ. సోదెమ్మకు చల్ల అడగాలంటే సిగ్గేసింది. ముంతను కొంగు చాటున దాచుకుంది. కాసేపు కబుర్లు చెప్పి ఖాళీ ముంతతోనే తిరిగి ఇంటికి వెళ్లింది. భోజనంలోకి మజ్జిగ లేనందుకు మొగుడితో తిట్లు కూడా తినింది. ..ఇదీ కథ!
ఏదైనా పనిమీద ఒకరి వద్దకు వెళ్లినప్పుడు, ఏ పనిగా వచ్చామో చెప్పకుండా దాచుకుంటే, మొహమాటపడితే పని జరిగేదెలాగ? కాబట్టి కార్యార్థవై ఉన్నప్పుడు మొహమాటం తగదని ఈ సామెత చెబుతుంది. ఈ సామెత నీతి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు!
కానీ పవన్ కల్యాణ్ రూటే సెపరేటు. ఆయన చల్లకోసం వస్తారు. మొగమాటలం లేకుండా అడిగి పుచ్చుకుంటారు. కానీ.. తాను పొరుగింట్లో చల్ల అరువు పుచ్చుకున్న సంగతి మరెవ్వరికీ తెలియకూడదని మాత్రం అనుకుంటారు. చల్ల పుచ్చుకున్న తర్వాత ఆ ముంతను.. దాచిపెట్టుకుని, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. తమ మధ్య కేవలం కబుర్లు మాత్రమే సాగాయని వాడలోని ఇతరుల్ని మభ్య పెట్టాలని అనుకుంటారు.
ఆయన అటు ఢిల్లీ, ఇటు ఉండవిల్లీ నేతలతో సాగిస్తున్న భేటీల మర్మం అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో తన వ్యవహారాలన్నీ చూసుకున్న అన్నయ్య నాగబాబును ఎంపీగా రాజ్యసభకు పంపాలని పవన్ కోరిక. అడిగితే కాదనేంత సీన్ చంద్రబాబుకు లేదుగానీ.. ఈసారే ఇస్తారా.. నెక్ట్స్ టైం అంటారా అనేది అనుమానం. అందుకే ముందుగా ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో చర్చలు జరిపి.. తన మనోవాంఛను వారి ఎదుట చెప్పుకున్నారు. మూడింటిలో ఒక ఎంపీ సీటు కోసం బిజెపి పట్టుపట్టకుండా ఉంటే.. తాను దక్కించుకోవచ్చునని ముందుగా అక్కడ చక్రం తిప్పారు. తీరా ఇవాళ చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి వెళ్లి మాట తీసుకునే ప్రయత్నం చేశారు.
బాబు వద్దకెళ్లడమూ మాట పుచ్చుకోవడమూ అయింది. అయితే తాను ఎంపీ సీటు కోసం వీరందరి ఇళ్లకూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నానని ప్రజలకు తెలియరాదు– అనేది ఆయన కోరిక. అంటే చల్ల పుచ్చుకోవాలి గానీ.. ఆ సంగతి ఇతరులకు మాత్రం తెలియద్దన్నమాట.
పైకి మాత్రం.. కాకినాడ బియ్యం స్మగ్లింగ్ గురించి బాబుతో చర్చించినట్లుగా, రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం గురించి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసినట్టుగా.. బాహ్య ప్రపంచానికి ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. తాను అన్నయ్య నాగబాబు ఎంపీ సీటు కోసమే తిరుగుతున్నట్టుగా జనం గుర్తిస్తే పలుచన అవుతానని భయపడుతున్నారో ఏమో పాపం!
.. ఎం. రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment