‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది అయిపోయింది. ఈలోగా ఒక వేటగాడు దానిని పట్టుకుని కోరలు పీకి మళ్లీ అడవిలో వదిలేశాడు. ఇక కదలలేని పరిస్థితి వచ్చింది. జనం గానీ, మిగిలిన జీవులు గానీ దాన్ని పట్టించుకోవడమే మానేశాయి. దానికి పొట్టగడవడం కూడా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దారిలో ఒక సన్యాసి వెళుతూ ఉంటే ఆయనను తనకో దారి చూపించమని ప్రాధేయపడింది. ఆయన దానితో.. ‘నువ్వు కదలలేని, కరవలేని ముసలి పామువి అయిపోయావు గానీ కనీసం బుసకొట్టగలవు కదా.. కాబట్టి బుస కొడుతూ ఉండు.. అందరూ నిన్ను చూసి భయపడతారు’ అని సలహా చెప్పి వెళ్లాడు.
ఈ ఐడియా భలే ఉందని ఆ పాముకు అనిపించింది. అప్పటి నుంచి బుస కొట్టడం ప్రారంభించింది. కొన్ని జీవులు భయపడేవి కూడా! కొన్నాళ్లకు వాటన్నింటికీ అసలు విషయం అర్థమైంది. ‘ఈ పాము బుసకొడుతుందే తప్ప.. కాటు వేయలేదు’ అని తెలుసుకున్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక దాని ఎదుట బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుగా.. చిట్టెలుకలు, చిట్టి కుందేళ్లు కూడా ఆ పాము ఎదుట డిస్కో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఆ పాము గట్టిగా బుస కొడుతుంది. కానీ మిగిలిన జీవులు కనీసంగా కూడా పట్టించుకోవడం మానేశాయి. పాపం.. ఆ పాము ముసలి బతుకు అలాగే గడిచిపోయింది’ ఇదీ కథ.
ఈ కథకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు చిన్న సామ్యం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానంటే అందరికీ హడల్ అని, తనను చూసి అందరూ జడుసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. తాను రంకె వేస్తే భూకంపం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలోని సీనియర్లలోనే చంద్రబాబు పట్ల భయం కాదు కదా.. జాలి కలుగుతోంది.
దేశంలోనే నన్ను మించిన సీనియారిటీ ఉన్న నాయకుడు లేరని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తనను మించిన మహానుభావులు లేరని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ, సొంత పార్టీలో ఆయనకు ఒకప్పుడు ఉన్నంత విలువ, గౌరవం, ఆయన పట్ల భయం ఇప్పుడు లేవు. తాజాగా ఆర్టీపీపీ తడి బూడిద గొడవ ఇందుకు పెద్ద ఉదాహరణ.
ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి బూడిదను అమ్ముకోవడంలో రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయల దందా తెలుగుదేశం నేతలు సాగిస్తున్నట్టుగా గుసగుసలున్నాయి. దీనికోసం కూటమి పార్టీల నాయకులే కొట్టుకుంటున్నారు. లోకల్ టీడీపీ భూపేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య తగాదాలు ముదిరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ రాజీ చర్చలు చేసినా.. వారు దిగిరాలేదు. అప్పుడు బుస కొట్టడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందరినీ తన ఎదుట హాజరుకావాలని పురమాయించారు.
ఆయన మాటలను జేసీ ప్రభాకర రెడ్డి బేఖాతర్ అన్నారు. బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చి తన వాదన చెప్పుకుని వెళ్లిపోయారు. బాబు ‘బుస’లను సొంత పార్టీ వారు కూడా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రమే కాదు, పార్టీలో బొడ్డూడని నాయకులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్రెంటిసులు కూడా చంద్రబాబు బుసలను పట్టించుకోవడం లేదు. లోకల్‌గా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.
దందాలు చేస్తే తాటతీస్తా అని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. బహుశా ఈ అప్రెంటిస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు హూంకరింపులు చూసి జాలిగా నవ్వుకుంటూ ఉంటారేమో! ఒకప్పట్లో ఎడాపెడా పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటూ మీడియాలో ప్రచారం కోరుకుంటూ తమ మీద రెచ్చిపోతూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అప్రెంటీసులకు కూడా లెక్కలేకుండా అయిపోయారని ఇప్పుడు సీనియర్లు బాబు పరిస్థితి మీద జాలిపడుతున్నారు.
-ఎం.రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment