పూడికతీత ఎప్పటికో..
గిలకలదిండి హార్బర్ సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేట
రోజులో గంట మాత్రమే బోట్లు వెళ్లేందుకు అవకాశం
పూడికతీసి 30 సంవత్సరాలు అమలుకు నోచుకోని మంత్రి హామీ
మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిలకలదిండి హార్బర్‌లో సముద్రముఖ ద్వారం వద్ద పూడిక మేటవేసింది. ముఖద్వారం కనీసం 10 నుంచి 12అడుగుల లోతు ఉండాల్సి ఉండగా, ఒకచోట ఐదు అడుగులు, పక్కనే మరోచోట అడుగు లోతు మాత్రమే ఉంటోంది. దీంతో మత్స్యకారుల బోట్లు దెబ్బతింటున్నాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని బోటు యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
లోతు ఎక్కడో తెలియదు..
గిలకలదిండి హార్బర్ నుంచి అధికారిక లెక్కల ప్రకారం వందకు పైగా మెకనైజ్డ్ బోట్లు, 60కి పైగా పెద్ద ఫైబర్‌బోట్లు చేపలవేటకు వెళ్లి వస్తుంటాయి. అనధికారికంగా మరో 100 వరకు మెకనైజ్డ్, పెద్ద ఫైబర్ బోట్లు చేపలవేట కొనసాగిస్తున్నాయి. ఈ బోట్ల నుంచి సాగించే వేట వల్ల వచ్చే మత్స్య సంపద ద్వారా రోజూ లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయితే చేపలవేటకు వెళ్లి రావాలంటే హార్బర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర కాలువలో ప్రయాణించాలి. ఆ తర్వాత సముద్ర ముఖద్వారం వస్తుంది. ఇక్కడే అసలు సమస్య మేటవేసింది. ముఖద్వారం వద్ద ఇసుక మేట వేయటంతో ఎక్కడ సముద్రం లోతుగా ఉంది.. ఎక్కడ మెరకగా ఉంది.. అనే విషయం తెలియడం లేదు. ఎవరైనా డ్రైవర్ లోతును అంచనా వేయలేక బోటును ముందుకు నడిపితే మేట వద్ద చిక్కుకుపోతోంది. సముద్రం నుంచి వచ్చే అలలు ఈ బోటును బలంగా తాకటంతో అది పగిలిపోతోంది. గత నాలుగు నెలల వ్యవధిలో నాలుగు మెకనైజ్డ్ బోట్లు ముఖద్వారం వద్ద చిక్కుకుని పాడైపోయాయి. ఈ బోట్లలోని వలలను మినహాయిస్తే ఒక్కో బోటులో ఉన్న యంత్రాలు, సౌకర్యాలను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల విలువ ఉంటుందని బోటు యజమానులు చెబుతున్నారు. మేట వేసిన ప్రాంతాల్లో బోట్లు చిక్కుకుపోతున్నాయని పలుమార్లు పాలకులకు, అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు.
పూడిక తీసి 30 సంవత్సరాలు
గిలకలదిండి హార్బర్‌కు సమీపంలో సముద్ర ముఖద్వారం వద్ద పూడికతీసి 30 సంవత్సరాలకు పైగా అయ్యిందని బోటు యజమానులు, స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సముద్ర ముఖద్వారాన్ని జిల్లాస్థాయి అధికారులు, ఓడరేవుల శాఖ ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. రూ.16 కోట్లతో ముఖద్వారంలో పూడికతీస్తామని ఆయన హామీ ఇచ్చారని మత్స్యకారులు చెబుతున్నారు. మూడేళ్లయినా ఆ హామీ అమలుకు నోచుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలల వెంబడి వచ్చిన ఇసుక బోట్లు వెళ్లే కాలువలో మేట వేస్తోంది. కాబట్టి గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లే కాలువకు కుడివైపున ముఖద్వారం నుంచి రెండు కిలోమీటర్ల మేర రాళ్లతో సముద్రంలోకి అడ్డుగోడ నిర్మిస్తే అలల తాకిడి తగ్గి ముఖద్వారం పూడుకుపోకుండా ఉంటుందని స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు చెబుతున్నారు.
24 గంటలు ఆగాల్సిందే..
సముద్రంలో ఆటు, పోటు వేళలు ప్రతి రోజు మారుతుంటాయి. పగటి సమయంలో సముద్రం పోటు వచ్చినప్పుడు గంట పాటు గిలకలదిండి హార్బర్ నుంచి బోట్ల రాకపోకలకు అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో సముద్రంలోనే రెండు కిలోమీటర్ల దూరంలో బోటుకు లంగరు వేసి మళ్లీ పోటు వచ్చే వరకు నిలిపివేస్తున్నారు. దీనివల్ల తుపానులు వచ్చినప్పుడు సముద్రంలో ఉన్న బోట్లు గిలకలదిండి హార్బర్‌కు త్వరగా చేరేందుకు అవకాశం లేకుండాపోతోందని బోటు యజమానులు వాపోతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఒడ్డుకు తీసుకురావాలంటే అష్టకష్టాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్నిసార్లు వేట ముగిసిన వెంటనే బయటకు రాలేకపోతున్నామని, ఆలస్యమైతే పెద్ద వ్యాపారులు చేపల కొనుగోలును పూర్తిగా నిలిపివేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు నిర్ణయించిన ధరకే చేపలను విక్రయించాల్సి వస్తోందని, ఒక్కో రోజు ఖర్చులు కూడా రావడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిలకలదిండి హార్బర్ నుంచి ముఖద్వారం వరకు డ్రెడ్జింగ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.