గిలకలదిండిలో ఇళ్ల స్థలాలపై టీడీపీ వారు స్టే తీసుకురావటంపై ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
మచిలీపట్నం: పేదల ఇళ్ల స్థలాలు కోసం ఎంపిక చేసిన భూమిపై టీడీపీ నాయకులు తప్పుడు కేసులు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మచిలీపట్నం గిలకలదిండి గ్రామస్తులు మంగళవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం సంబంధిత భూమిలో స్థానిక పేదలు పిల్లాపాపలతో కలిసి బైఠాయించారు. వివరాల్లోకి వెళితే..
► మచిలీపట్నం శివారు గిలకలదిండి గ్రామానికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. లోతట్టుగా ఉన్న ఆ స్థలాన్ని ఎత్తు చేసే పనులు కొనసాగుతున్నాయి.
► గిలకలదిండికి చెందిన సుమారు 1,100 కుటుంబాలకు ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే జాబితా సిద్ధమైంది. తాజాగా ప్లాట్‌లుగా విభజించే పనులు జరుగుతున్నాయి.
► అయితే, ఆ భూమిలో మడ అడవులున్నాయని, దీనివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కోర్టును ఆశ్రయించి.. ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే తెచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులై ఆందోళనకు దిగారు.
► నిరుపేదలకు స్థలాలు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
► అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోని రవీంద్ర ఇప్పుడు ప్రభుత్వ పథకాలేవీ అందకుండా కుట్రలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు.
► సమాచారం అందుకున్న తహసీల్దార్ సునీల్‌బాబు రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
► అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, పేదలకు తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు.
► ఆ భూమి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించే నిమిత్తం డ్రోన్ కెమేరాతో ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు.
► గిలకలదిండి వద్ద ఎంపిక చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని, వాటిపై స్టే ఇచ్చినట్లుగా న్యాయస్థానం నుంచి తమకెలాంటి పత్రాలు అందలేదని తహసీల్దార్ సునీల్‌బాబు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment