‘నేనే వస్తా నాన్న అంది.. నా కూతురుని చంపేశాడు’
హైదరాబాద్: తమ కూతురుది ముమ్మాటికి హత్యే అని పద్మజ తండ్రి నాగేశ్వరరావు అన్నారు. ఇంటికి వస్తుందనుకున్న తమ కూతురు ఆస్పత్రిలో చేర్పించామనే అనూహ్య వార్త వినాల్సి వచ్చిందని, అక్కడి వెళ్లి చూస్తే చనిపోయిన తమ కూతురుని చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. నిత్యం గొడవపడే తన అల్లుడు పద్మజను హత్య చేశాడని అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్న వివాహిత పద్మజ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేసన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది.
స్థానిక సుదర్శన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గిరీష్ నర్సింహకు పద్మజకు ఏడాది క్రితం వివాహమైంది. పద్మజ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్‌గా పని చేస్తూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రస్తుతం ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె తండ్రిని సాక్షి వివరాలు కోరగా ‘ప్రతి ఆదివారం మా కూతురు ఇంటికి వచ్చేది. ఎప్పటిలాగే ఫోన్ చేశాం. తీసుకెళ్లడానికి రమ్మంటావా అని అడిగితే బట్టలు ఆరేశాను.. వాటిని తీసేసి వస్తాను అని చెప్పింది. సాయంత్రం 4అయినా రాలేదు. మేం తను వస్తుందని అలాగే ఎదురుచూస్తూ కూర్చున్నాం.
ఈలోగా పద్మజ భర్త ఫోన్ చేసి తనకు ముక్కులు, చెవుల నుంచి రక్తం వస్తుందని ఆస్పత్రికి తీసుకెళుతున్నానని చెప్పాడు. మేం వెళ్లేసరికే కారులో వెళ్లిపోయారు. ఆస్పత్రికి వెళ్లేసరికి ఐసీయూలో ఉంచారు. వైద్యులు ముందు ఏమీ చెప్పలేదు.. ఆవెంటనే తను చనిపోయిందని చెప్పారు. తన ముఖంపై, శరీరంపై గాయాలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు నా బిడ్డను కొట్టేవాడు. నా కూతురుని అల్లుడు హత్య చేశాడు’ అని పద్మజ తండ్రి నాగేశ్వరరావు కన్నీరుమున్నీరవుతూ చెప్పాడు.