girl child died
-
డెంగీ పంజా
మణికొండ: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు వ్యాధుల బారినపడి ఆస్పత్రుల బాట పట్టారు. ఈ క్రమంలో డెంగీ పంజా విసురుతోంది. తీవ్ర జ్వరం బారినపడిన ప్రజలు మంచాన పడ్డారు. డెంగ్యూతో బాధపడుతూ ఆదివారం ఒక్కరోజే ఇద్దరు బాలికలు మృతిచెందారు. తాండూరులో ఒక బాలిక, నార్సింగిలో మరో బాలిక డెంగీకి బలయ్యారు. దీంతో వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాలిక పర్హీన్ (15) శుక్రవారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. సాధారణ జ్వరమేనని భావించి తల్లితండ్రులు తగ్గిపోతుందని అనుకున్నారు. అయితే శనివారం తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఓ వైద్యుడికి చూపించారు. ఆ వైద్యుడు రాసిన మందులు బాలిక వేసుకుంది. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే బాలిక మృతి చెందిన తరువాత రిపోర్టులు వచ్చాయి. రిపోర్టుల్లో డెంగీ సోకిందని ఉంది. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ కూతురును కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరులో.. తాండూరు టౌన్: డెంగీతో బాధపడుతూ 11 ఏళ్ల విద్యార్థిని మృతిచెందింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని సీతారాంపేట్‌కు చెందిన రాంచందర్ కూతురు ఆశ్రిత (11) గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఇటీవల తీవ్ర జ్వరం బారిన పడడంతో తాండూరులోని ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాలిక శనివారం రాత్రి మృతిచెందింది. ఎప్పుడూ చలాకీగా ఉండే పాప మరణించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గతంలోనే భార్యను కోల్పోగా ఇప్పుడు కూతురు కూడా మరణించడంతో తండ్రి రాంచందర్ కుంగిపోయాడు. -
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
నెల్లిమర్ల: స్థానిక మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. చిన్నారి బంధువులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వల్లూరు నరేష్, మాధురి దంపతుల కుమార్తె వల్లూరి దీప్తి(4) జ్వరం రావడంతో వారం రోజుల క్రితం మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఊపిరితిత్తుల్లో కఫం చేరిందని నిర్ధారించిన వైద్యులు వార్డులో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. గురువారం నాటికి దాదాపు ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. అయితే ఇంటికి పంపించే ముందు ఓ ఇంజిక్షన్ ఇచ్చారు. ఇంజిక్షన్ రియాక్షన్ ఇవ్వడంతో చిన్నారి కొద్ది సమయంలోనే మృత్యువాత పడింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ చిన్నారి చనిపోయిందని తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆరోపించారు. వైద్యం అందించడంలో తమ నిర్లక్ష్యం లేదని, యాంటీబయోటిక్ ఇంజిక్షన్ మాత్రమే తాము చేశామని వైద్యులు తెలిపారు. పుట్టినరోజునే మృత్యు ఒడికి.. గురువారం చిన్నారి దీప్తి పుట్టినరోజు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీప్తి మిమ్స్ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి వెళ్లింది. ఆలయ అర్చకులు సంపత్ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. తన పుట్టినరోజు అని వార్డులోని చిన్నారులందరికీ చాక్లెట్లు పంచిపెట్టింది. తాను ఇంటికి వెళ్లిపోతున్నానని, ఇంటిదగ్గర కేకు కట్ చేస్తానని సంతోషంగా చెప్పింది. అయితే ఇంతలోనే కన్నుకుట్టిన మృత్యువు ఆ చిన్నారిని తీసుకెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వార్డులోని ఇతర చిన్నారులు, తల్లిదండ్రులు దుంఖంలో మునిగిపోయారు. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించిన అర్చకుడి దీవెనలు కూడా చిన్నారిని మృత్యువు నుంచి కాపాడలేకపోయాయని అందరూ భోరుమన్నారు. -
చితికిన చిన్నారి జీవితం
ఆ దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే. వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఆ దంపతులు తమ పిల్లలకు ఏ కష్టం రాకూడదని మంచి చదువులు చదివించాలని భావించారు. దీంతో ఉన్న ఊరిలో కాదని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. పాఠశాల స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త ఆ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లుచల్లింది. పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన హృదయ విదారక ఘటన మండల పరిధిలోని నారాయణరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ఆర్ జిల్లా, అట్లూరు : మండల పరిధిలోని నారాయణరాజుపేటకు చెందిన చింతంరెడ్డినాగేశ్వర్‌రెడ్డి, వసుధదేవిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమార్తె అయిన చింతంరెడ్డినాగలక్ష్మి (5) బద్వేలు పట్టణంలోని మహేశ్వర్‌రెడ్డి హైస్కూల్లో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజు గ్రామానికి వచ్చే ఏపీ04ఎక్స్3336 నంబరు గల స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండేది. రోజూ మాదిరే సోమవారం పాఠశాలకు వెళ్లిన నాగలక్ష్మి సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకుని బస్సు దిగింది. ఈ సమయంలో చిన్నారి బస్సు పక్కనే ఉండగా బస్సుడ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో చిన్నారి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ బస్సు కింద పడి మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న నాగలక్ష్మి తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి పరుగులు తీసి కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం ఇంట్లో సందడిగా గడిపిన తమ చిన్నారి ఇక రాదని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ‘‘దేవుడా, మాకెందుకు ఇంత అన్యాయం చేశావంటూ’’రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. ఎస్ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, బస్సును స్టేషన్‌కు తరలించారు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా బస్సుడ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మిగతా గ్రామాలకు వెళ్లాల్సిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లారు. -
కాలువలో కలిసిన మానవత్వం
శ్రీకాకుళం రూరల్:మానవత్వం మంటకలిసింది. ముక్కుపచ్చలారని, రోజుల పసికందును డ్రైనేజీలో పడేసి ఓ తల్లి చేతులు దులుపుకొంది. ఈ సంఘటన చూసిన వారంతా అయ్యో...రామా అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం నగరం పరిధిలోని చినబరాటం వీధిలో ఓ షాపును ఆనుకొని ఉన్న డ్రైనేజీలో రోజులు కావస్తున్న ఓ ఆడ శిశువు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. కాలువలోని మురుగునీటిలో మునుగుతూ తేలుతూ ఇటువైపు కొట్టుకుంటూ వచ్చింది. ముందుగా చేతివేళ్లు బయటకు రావడంతో అక్కడ ఉన్నవారంతా దాన్ని గమనించి కాలువ నుంచి పసికందును బయటకు తీశారు. అయితే ఓ వస్త్రాల షాపు సంచిలో ఈ ఆడ శిశువు మృతదేహాన్ని మూటకట్టి పడేసినట్టుగా స్థానికులు గుర్తించారు. తీసి చూడగానే ఇంకా పూర్తిస్థాయిలో బొడ్డు కూడా కోయలేదని ఆవేదన చెందారు. ఎవరో గుర్తుతెలియని వారు రాత్రి వేళల్లో ఇలాంటి దారుణానికి పూనుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేజోవంతమైన ముఖ కవలికలు పసికందును చూడగానే తేజోవంతమైన ముఖకవలికలు, బొద్దుగా చూడ్డానికి హత్తుకుపోయే విధంగా ఉంది. శిశువుపై ధరించిన నీలిరంగు గౌను, అదే రంగు గడులు తువ్వాల్లో చుట్టేసి పడేశారు. పసికందును చూసిన వారంతా అయ్యో... రామా అంటూ శిశువును కన్న తల్లిదండ్రులకు శాపనార్థాలు పెట్టారు. వివాహేతర సంబంధాలు, బరితెగించిన వారే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆనోట ఈనోట పాకడంతో ఆ శిశువును చూడడానికి జనాలు మరింతగా ఎగబడ్డారు. ఒన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. చుట్టు పక్కలా ఆసుపత్రులు ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో ఎవరైనా ప్రసవం చేశారా అన్న కోణంలో ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆపరేషన్‌కు వస్తే.. ఆయువు తీసేశారు!
శ్రీకాకుళం న్యూకాలనీ /పొందూరు: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. టాన్సిల్స్ ఆపరేషన్ వికటించడంతో తొమ్మిదేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పొందూరు మండలం అలమాజీపేట గ్రామానికి చెందిన చిగిలిపల్లి శ్రీనివాసరావు, రమా దంపతులకు ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల కుమార్తె చాందిని (4వ తరగతి), ఏడేళ్ల కుమారుడు సాయిచందన్(3వ తరగతి) కింతలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. శ్రీనివాసరావు జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రమా గృహిణి. చాందినికి వారం రోజుల క్రితం మెడ వద్ద టాన్సిల్స్ సమస్య రావడంతో శ్రీకాకుళం డేఅండ్‌నైట్ జంక్షన్ వద్ద ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కింతలి సోమేశ్వరరావుకు వద్దకు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి టాన్సిల్స్ తీయాల్సి ఉంటుందని చెప్పడంతో సరేనని తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే వైద్యుడికి సొంతంగా ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో సురక్ష కిడ్నీ మెటర్నిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం చాందినిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు.లోపలికి వెళ్లిన రెండు గంటల తర్వాత హార్ట్‌పల్స్‌రేట్ సరిగా లేదని.. కార్డియాలజిస్ట్‌కు పిలిచామని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. మరో 30 నిమిషాల తర్వాత పాప చనిపోయిందని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పాప చనిపోయిందని సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ పాపని ఏం చేశారో చెప్పాలని డాక్టర్లను నిలదీయడంతో వారంతా బిక్కమొహం వేశారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు, ప్రైవేటు డాక్టర్ల సంఘ ప్రతినిధులు రంగ ప్రవేశం చేసి బంధువులను సముదాయించారు. అనస్థీషియా పనిని కూడా డాక్టర్ కింతలి సోమేశ్వరరావే చేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. డ్రగ్ డోస్ ఎక్కువగా ఇవ్వడంతో బ్రెయిన్ పనిచేయడం మానేసి.. హార్ట్‌పల్స్ రేట్ పడిపోయి పాప ప్రాణాలు విడిచిందని పరిశీలనకు వచ్చిన వైద్యులు గుర్తించారు. పాప మృతి చెందిన తర్వాత ముక్కు, చెవుల నుంచి రక్తం ధారకట్టింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో సాయంత్రం అలమాజీపేటలో దహనసంస్కారాలు పూర్తిచేశారు. కాగా, ఈ ఘటన విషయంలో ఇరువర్గాలకు రాజీ కుదిరినట్లు తెలిసింది. అలమాజీపేటలో విషాదఛాయలు.. చిన్నారి చాందిని స్వగ్రామం అలమాజీపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. నిన్నమొన్నటి వరకు తమతోనే ఉన్న కుమార్తె ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్క ఎందుకు రాలేదని తమ్ముడు సాయిచందన్ అడుగుతుండటం స్థానికులను కంటతడి పెట్టించింది. -
డెంగీతో చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
నల్లకుంట: డెంగీ జ్వరంతో బాధపడుతున్న చిన్నారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తమ పాప మృతికి వైద్యులే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. ఆస్పత్రి వర్గాలు, బాధితుల కథనం ప్రకారం... బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంటకు చెందిన ఎం.అశోక్, కోటమ్మ దంపతులు తమ కుమార్తె పవిత్ర (ఏడాదిన్నర)కు తీవ్రమైన జ్వరం రావటంతో ఈ నెల 24న విద్యానగర్ ఓయూ రోడ్డులో గల ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు డెంగీ జ్వరంగా నిర్ధారించి ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స చేశారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడక పోవడంతో వైద్యులు ఎల్లో బ్లడ్ ఎక్కించాలని తల్లిదండ్రులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించటంతో సోమవారం సాయంత్రం చిన్నారికి రక్తం ఎక్కించారు. రాత్రి నుంచి చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చివరికి ఆస్పత్రి యాజమాన్యంతో రాజీ కుదరటంతో చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.