కాలువలో కలిసిన మానవత్వం | Dead Girl Child Found on Drainage Canal Srikakulam | Sakshi
Sakshi News home page

కాలువలో కలిసిన మానవత్వం

Published Tue, Jan 22 2019 6:56 AM | Last Updated on Tue, Jan 22 2019 6:56 AM

Dead Girl Child Found on Drainage Canal Srikakulam - Sakshi

శిశువును చూస్తున్న స్థానికులు

శ్రీకాకుళం రూరల్‌:మానవత్వం మంటకలిసింది. ముక్కుపచ్చలారని, రోజుల పసికందును డ్రైనేజీలో పడేసి ఓ తల్లి చేతులు దులుపుకొంది. ఈ సంఘటన చూసిన వారంతా అయ్యో...రామా అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం నగరం పరిధిలోని చినబరాటం వీధిలో ఓ షాపును ఆనుకొని ఉన్న డ్రైనేజీలో రోజులు కావస్తున్న ఓ ఆడ శిశువు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. కాలువలోని మురుగునీటిలో మునుగుతూ తేలుతూ ఇటువైపు కొట్టుకుంటూ వచ్చింది. ముందుగా చేతివేళ్లు బయటకు రావడంతో అక్కడ ఉన్నవారంతా దాన్ని గమనించి కాలువ నుంచి పసికందును బయటకు తీశారు. అయితే ఓ వస్త్రాల షాపు సంచిలో ఈ ఆడ శిశువు మృతదేహాన్ని మూటకట్టి పడేసినట్టుగా స్థానికులు గుర్తించారు. తీసి చూడగానే ఇంకా పూర్తిస్థాయిలో బొడ్డు కూడా కోయలేదని ఆవేదన చెందారు. ఎవరో గుర్తుతెలియని వారు రాత్రి వేళల్లో ఇలాంటి దారుణానికి పూనుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తేజోవంతమైన ముఖ కవలికలు
పసికందును చూడగానే తేజోవంతమైన ముఖకవలికలు, బొద్దుగా చూడ్డానికి హత్తుకుపోయే విధంగా ఉంది. శిశువుపై ధరించిన నీలిరంగు గౌను, అదే రంగు గడులు తువ్వాల్లో చుట్టేసి పడేశారు. పసికందును చూసిన వారంతా అయ్యో... రామా అంటూ శిశువును కన్న తల్లిదండ్రులకు శాపనార్థాలు పెట్టారు. వివాహేతర సంబంధాలు, బరితెగించిన వారే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆనోట ఈనోట పాకడంతో ఆ శిశువును చూడడానికి జనాలు మరింతగా ఎగబడ్డారు. ఒన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. చుట్టు పక్కలా ఆసుపత్రులు ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో ఎవరైనా ప్రసవం చేశారా అన్న కోణంలో ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement