girl child sold
-
సాకే స్థోమత లేకనే బిడ్డను ఇచ్చేశా
బషీరాబాద్(తాండూరు): బషీరాబాద్ మండలం నావంద్గి గ్రామంలో వెలుగు చూసిన పసిపాప అక్రమ దత్తత వ్యవహారం బుధవారం కీలక మలుపు తిరిగింది. నెల రోజుల వయసున్న ఆడబిడ్డను తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చామే తప్ప.. అమ్ముకోలేదని చెన్నారం గ్రామానికి చెందిన పాప తండ్రి పానాదుల పకీరప్ప అధికారులకు తెలిపారు. అనారోగ్యంతో భార్య చనిపోవడం వలన మానసికంగా కుంగిపోయానని, ఈ పరిస్థితుల్లో పాప ఆలనా పాలనా చూసే ఆర్థిక స్థోమత లేదంటూ కన్నీరు మున్నీరయ్యాడు. తన బిడ్డను ప్రభుత్వానికి అప్పగిస్తూ అధికారులకు స్టాంపు పేపర్‌పై అంగీకార పత్రం రాసిచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత... యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన పానాదుల పకీరప్ప, జగ్గమ్మ దంపతుల నెల రోజుల వయసున్న కూతురిని పది రోజుల కిందట దూరపు బంధువులైన నావంద్గి బొడ్డు బాలప్ప, అమృతమ్మ, బాలమణి దంపతులకు అప్పగించారు. అయితే ఇది అక్రమ దత్తతని 1098 చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ ప్రతినిధి హన్మంత్‌రెడ్డి సమాచారాన్ని అధికారులకు అందించారు. బుధవారం వీఆర్ఓ రాఘవేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ నర్సమ్మ, శిశుగృహ ఎంఎస్‌డబ్ల్యూ నరేష్, హన్మంత్‌రెడ్డి నావంద్గి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పిల్లలను ఎలా తీసుకుంటారని బాలప్ప అమృతమ్మ, బాలమణి దంపతులను నిలదీశారు. అయితే పెంచుకోవడానికి బంధువులు ఇచ్చారని, తమ దగ్గర ఉన్న పాపను అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వారు అధికారులకు బదులిచ్చారు. వెంటనే పాపను తీసుకుని.. పాప తండ్రి పకీరప్పను పిలిచి విచారించారు. తనకు బిడ్డను సాకే స్థోమత లేదని, ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తండ్రి పకీరప్ప అధికారులతో చెప్పాడు. దీంతో తండ్రిగా వంద రూపాయల స్టాంపుపై బిడ్డను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అంగీకార పత్రం రాసిచ్చాడు. అనంతరం అధికారులు ఆ పాపను తాండూరు శిశు గృహకు తరలించారు. కార్యక్రమంలో శిశు గృహ ఇన్చార్జి శ్రీనివాస్, యాలాల చైల్డ్‌లైన్ ప్రతినిధి వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
తల్లిదండ్రులకు ఆడశిశువు అప్పగింత
పర్వతగిరి(వర్ధన్నపేట): మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించిందని తల్లిదండ్రులు విక్రయించగా, బాలల సంరక్షణ అధికారి అడ్డుకుని కౌన్సెలింగ్ చేసిన తర్వాత తిరిగి వారికి మంగళవారం అప్పగించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన దంపతులకు మొదటి కాన్పులో పాప, రెండో కాన్పులో బాబు జన్మించారు. మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించగా ఐదు రోజుల పసికందును పరకాలకు చెందిన వారికి మధ్యవర్తుల సాయంతో ఇచ్చేశారు. విషయం తెలిసి బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి, ఐసీడీఎస్ అధికారులతో విచారణ జరిపారు. చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు తేలగా మంగళవారం హన్మకొండలోని బాలల సంరక్షణ కార్యాలయంలో వారిని హాజరయ్యారు. ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పసికందును తల్లిదండ్రులకు జిల్లా బాలల సంరక్షణ చైర్పర్సన్ అనితారెడ్డి అప్పగించారు. సర్పంచ్ పల్లకొండ రజిత, సీడీపీఓ భాగ్యలక్ష్మి, సూపర్వైజర్లు సలోని, విక్టోరియా ఉన్నారు. -
ఆడపిల్లను అమ్మేశారు!
⇒ కాసుల కక్కుర్తితో తెలంగాణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుల దుర్మార్గం ⇒ అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ⇒ మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో నిరాశ.. ⇒ అసంతృప్తిని కనిపెట్టి.. పాపను అమ్మేయాలంటూ ఒత్తిడి ⇒ డబ్బులు వస్తాయంటూ ప్రలోభపెట్టిన వైద్యుడు ⇒ మధ్యవర్తి సహాయంతో రూ.35 వేలకు విక్రయం ⇒ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన ⇒ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఏడుగురు అరెస్టు ఇబ్రహీంపట్నం డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ ఆస్పత్రి నిర్వాహకులు తమ ఆస్పత్రిలో పుట్టిన ఓ ఆడపిల్లను అమ్మేశారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నందున పెంచడం కష్టమవుతుందంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి ఒప్పించారు. మూడు రోజుల పసికందును ఓ మధ్యవర్తి సహాయంతో రూ.35 వేలకు విక్రయించేశారు. అందులోంచి ఓ పదివేలు తల్లిదండ్రుల చేతిలో పెట్టి పంపేసి.. మిగతా సొమ్మును పంచేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న తెలంగాణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుల దుర్మార్గమిది. మూడు నెలల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శిశువు తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతులు, ఆస్పత్రి నిర్వాహకులు, మధ్యవర్తిని అరెస్టు చేశారు. ఎల్బీనగర్ డీసీపీ తప్సీర్ ఇక్బాల్ ఇందుకు సంబంధించిన వివ రాలను గురువారం మీడియాకు వెల్లడించారు. అమ్మేసి, డబ్బులు తీసుకోండి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి అనుబంధంగా ఉన్న సత్తి తండాకు చెందిన కొర్ర వనిత, జవహర్లాల్ దంపతులకు గతంలోనే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గతేడాది నవంబర్ 28న వనిత ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో మళ్లీ ఆడపిల్లను ప్రసవించింది. దీంతో ఆ దంపతులు నిరాశకు గురయ్యారు. అది చూసిన ఆస్పత్రి డైరెక్టర్, వైద్యుడు నేరెళ్ల శంకర్, అడ్మినిస్ట్రేటర్ నాయినంపల్లి శ్రీనివాస్‌లు.. ఆడపిల్ల పుడితే తప్పేమిటని, బాగా పెంచుకోవాలని చెప్పాల్సింది పోయి ఆ పాపను అమ్మేసుకోవాలని సలహా ఇచ్చారు. పైగా డబ్బులు వస్తాయని ఆశ చూపి శిశువును అమ్మేలా ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో వనిత, జవహర్ దంపతులు పాపను అమ్మేందుకు అంగీకరించారు. మధ్యవర్తి ద్వారా విక్రయం ఆస్పత్రి నిర్వాహకులు పాపను అమ్మే విషయాన్ని తమకు పరిచయమున్న ఆరుట్ల గ్రామానికి చెందిన శాంత అనే మహిళకు తెలిపారు. తమ వద్ద ఆడశిశువు ఉందని, ఎవరికైనా కావాలంటే విక్రయిస్తామని చెప్పారు. దీంతో శాంత కందుకూర్ క్రాస్‌రోడ్డులో నివసించే తమ బంధువులు ఏసరి వరలక్ష్మి, రవి దంపతులను సంప్రదించింది. వారికి పిల్లలు కలకపోవడంతో ఈ పాపను కొనుక్కొమ్మని సూచించింది. మూడు రోజుల శిశువును తెచ్చి పెంచుకుంటే భవిష్యత్తులో ఏ ఇబ్బందులూ ఉండవని సలహా ఇచ్చింది. దీనికి వారు అంగీకరించడంతో రూ.35 వేలకు బేరం కుదిరింది. ఆస్పత్రి నిర్వాహకులు, శాంత కలసి డబ్బులు తీసుకుని డిసెంబర్ ఒకటిన పాపను రవి, వరలక్ష్మి దంపతులకు అప్పగించారు. ఆ సొమ్ములో నుంచి తల్లిదండ్రులకు రూ. పది వేలు ఇచ్చి... మిగతా సొమ్మును శాంత, ఆస్పత్రి నిర్వాకులు పంచుకున్నారు. విలేకరులతో మాట్లాడుతున్న డీసీపీ తప్సీర్ ఇక్బాల్, వెనుక నిందితులు సందేహాలతో.. శిశువు తమ బిడ్డేనని ఆమెను తీసుకెళ్లిన దంపతులు చెప్పుకోవడంతో.. గర్భవతి కాని వరలక్ష్మికి బిడ్డ ఎలా పుట్టిందని స్థానికులు, ఇరుగుపొరుగు వారికి సందేహాలు తలెత్తాయి. మరోవైపు అటు శాంతకు, ఆస్పత్రి సిబ్బందికి ఏదో అంశంలో విభేదాలు వచ్చాయి. చివరికి పాపను విక్రయించిన విషయంపై ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగి ఆరా తీయగా.. శిశువు అమ్మకం నిజమేనని తేలింది. దీంతో శిశువు తల్లిదండ్రులు వనిత, జవహర్, కొన్న దంపతులు రవి, వరలక్ష్మి, మధ్యవర్తి శాంత, ఆస్పత్రి నిర్వాహకులు డా.శంకర్, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. శిశువును హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న శిశువిహార్‌కు తరలించారు. ఆస్పత్రిపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. -
ఐదు వేలకు ‘బంగారుతల్లి’ విక్రయం
పాలకుర్తి, న్యూస్‌లైన్: మూడో సంతానంగా పుట్టిన ఆడపిల్లను ఆ తల్లిదండ్రులు సాకలేక పిల్లలు లేని దంపతులకు రూ. 5 వేలకు విక్రయించిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామ శివారు గుడికుంట తండాకు చెందిన బానోతు భారతి, హరిచందర్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆర్నెళ్ల క్రితం మూడో సంతానంగా కూతురు జన్మించింది. ఆడపిల్ల కావడంతో పోషించలేమని భావించిన తల్లిదండ్రులు ఆ బిడ్డను అమ్మకానికి పెట్టారు. ఇదే మండంలోని ఓ గ్రామానికి చెందిన సంతానం లేని దంపతులకు రూ.5,000కు వారం రోజుల క్రితం విక్రయించారు. తమ బిడ్డను విక్రయించిన మాట వాస్తవమేనని పసికందు తల్లిదండ్రులు ‘న్యూస్‌లైన్’ వద్ద అంగీకరించారు.