ఆడపిల్లను అమ్మేశారు! | multi speciality hospital sold girl child in telangana | Sakshi
Sakshi News home page

ఆడపిల్లను అమ్మేశారు!

Published Fri, Mar 3 2017 3:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఆడపిల్లను అమ్మేశారు! - Sakshi

ఆడపిల్లను అమ్మేశారు!

కాసుల కక్కుర్తితో తెలంగాణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుల దుర్మార్గం
అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు
మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో నిరాశ..
అసంతృప్తిని కనిపెట్టి.. పాపను అమ్మేయాలంటూ ఒత్తిడి
డబ్బులు వస్తాయంటూ ప్రలోభపెట్టిన వైద్యుడు
మధ్యవర్తి సహాయంతో రూ.35 వేలకు విక్రయం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఏడుగురు అరెస్టు  


ఇబ్రహీంపట్నం
డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ ఆస్పత్రి నిర్వాహకులు తమ ఆస్పత్రిలో పుట్టిన ఓ ఆడపిల్లను అమ్మేశారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నందున పెంచడం కష్టమవుతుందంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి ఒప్పించారు. మూడు రోజుల పసికందును ఓ మధ్యవర్తి సహాయంతో రూ.35 వేలకు విక్రయించేశారు. అందులోంచి ఓ పదివేలు తల్లిదండ్రుల చేతిలో పెట్టి పంపేసి.. మిగతా సొమ్మును పంచేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న తెలంగాణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుల  దుర్మార్గమిది. మూడు నెలల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శిశువు తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతులు, ఆస్పత్రి నిర్వాహకులు, మధ్యవర్తిని అరెస్టు చేశారు. ఎల్‌బీనగర్‌ డీసీపీ తప్సీర్‌ ఇక్బాల్‌ ఇందుకు సంబంధించిన వివ రాలను గురువారం మీడియాకు వెల్లడించారు.

అమ్మేసి, డబ్బులు తీసుకోండి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి అనుబంధంగా ఉన్న సత్తి తండాకు చెందిన కొర్ర వనిత, జవహర్‌లాల్‌ దంపతులకు గతంలోనే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గతేడాది నవంబర్‌ 28న వనిత ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో మళ్లీ ఆడపిల్లను ప్రసవించింది. దీంతో ఆ దంపతులు నిరాశకు గురయ్యారు. అది చూసిన ఆస్పత్రి డైరెక్టర్, వైద్యుడు నేరెళ్ల శంకర్, అడ్మినిస్ట్రేటర్‌ నాయినంపల్లి శ్రీనివాస్‌లు.. ఆడపిల్ల పుడితే తప్పేమిటని, బాగా పెంచుకోవాలని చెప్పాల్సింది పోయి ఆ పాపను అమ్మేసుకోవాలని సలహా ఇచ్చారు. పైగా డబ్బులు వస్తాయని ఆశ చూపి శిశువును అమ్మేలా ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో వనిత, జవహర్‌ దంపతులు పాపను అమ్మేందుకు అంగీకరించారు.

మధ్యవర్తి ద్వారా విక్రయం
ఆస్పత్రి నిర్వాహకులు పాపను అమ్మే విషయాన్ని తమకు పరిచయమున్న ఆరుట్ల గ్రామానికి చెందిన శాంత అనే మహిళకు తెలిపారు. తమ వద్ద ఆడశిశువు ఉందని, ఎవరికైనా కావాలంటే విక్రయిస్తామని చెప్పారు. దీంతో శాంత కందుకూర్‌ క్రాస్‌రోడ్డులో నివసించే తమ బంధువులు ఏసరి వరలక్ష్మి, రవి దంపతులను సంప్రదించింది. వారికి పిల్లలు కలకపోవడంతో ఈ పాపను కొనుక్కొమ్మని సూచించింది. మూడు రోజుల శిశువును తెచ్చి పెంచుకుంటే భవిష్యత్తులో ఏ ఇబ్బందులూ ఉండవని సలహా ఇచ్చింది. దీనికి వారు అంగీకరించడంతో రూ.35 వేలకు బేరం కుదిరింది. ఆస్పత్రి నిర్వాహకులు, శాంత కలసి డబ్బులు తీసుకుని డిసెంబర్‌ ఒకటిన పాపను రవి, వరలక్ష్మి దంపతులకు అప్పగించారు. ఆ సొమ్ములో నుంచి తల్లిదండ్రులకు రూ. పది వేలు ఇచ్చి... మిగతా సొమ్మును శాంత, ఆస్పత్రి నిర్వాకులు పంచుకున్నారు.

                               విలేకరులతో మాట్లాడుతున్న డీసీపీ తప్సీర్‌ ఇక్బాల్, వెనుక నిందితులు

సందేహాలతో..
శిశువు తమ బిడ్డేనని ఆమెను తీసుకెళ్లిన దంపతులు చెప్పుకోవడంతో.. గర్భవతి కాని వరలక్ష్మికి బిడ్డ ఎలా పుట్టిందని స్థానికులు, ఇరుగుపొరుగు వారికి సందేహాలు తలెత్తాయి. మరోవైపు అటు శాంతకు, ఆస్పత్రి సిబ్బందికి ఏదో అంశంలో విభేదాలు వచ్చాయి. చివరికి పాపను విక్రయించిన విషయంపై ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగి ఆరా తీయగా.. శిశువు అమ్మకం నిజమేనని తేలింది. దీంతో శిశువు తల్లిదండ్రులు వనిత, జవహర్, కొన్న దంపతులు రవి, వరలక్ష్మి, మధ్యవర్తి శాంత, ఆస్పత్రి నిర్వాహకులు డా.శంకర్, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. శిశువును హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న శిశువిహార్‌కు తరలించారు. ఆస్పత్రిపై మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement