ఈ చిన్నసినిమా విశేషాలెన్నో....
సమాజం పట్ల తమకూ బాధ్యత ఉందంటూ బాలీవుడ్ అగ్రతారలు ప్రియాంకా చోప్రా, ఫ్రిదా పింటో ముందుకొచ్చారు. 'గర్ల్ రైజింగ్ - వో పఢేగీ, వో ఉడేగీ' అనే షార్ట్ ఫిలింతో బాలికలను ప్రోత్సహించేందుకు వీరు నడుం కట్టారు. వీరి ప్రయత్నానికి బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు చేతులు కలపడం పలువురి ప్రశంసలందుకుంటోంది.
ప్రియాంకా చోప్రా, ఫ్రిదాపింటో నిర్మాతలుగా కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గర్ల్ రైజింగ్ - వో పఢేగీ, వో ఉడేగీ షార్ట్ ఫిలిం రూపుదిద్దుకొంది. బాలికా విద్య ప్రచారానికి, బాలికలు చదువుకుంటే వారికి కలిగేప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఆస్కార్ అవార్డు విజేత రిచర్డ్ ఇ.రాబిన్స్ దర్శకత్వంలో రూపొందిన ఇంగ్లీషు మూవీకి హిందీ వెర్షన్ ఇది. ఈనెల 29న రక్షా బంధన్ సందర్భంగా స్టార్ చానెల్లో ప్రసారం కానుంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానంతో మొదలయ్యే ఈ డాక్యుమెంటరీలో స్వయంగా ప్రియాంక, ఫ్రిదాకూడా నటించారు. వీరితోపాటు నందితాదాస్, మాధురీ దీక్షిత్, సుస్మితా సేన్, ఆలియా భట్, పరిణీతి చోప్రా, కరీనా కపూర్ కనిపించనున్నారు. బాలికా విద్య ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా ఈ షార్ట్ మూవీ రూపొందించామని నిర్మాతలు ప్రియాంక, ఫ్రిదా ఫింటో తెలిపారు.
గత జూన్లో ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ సినిమా గురించి వివరించినపుడు ఆయన చాలా సంతోషించారని నటి ఫ్రిదా చెప్పింది. అంతేకాదు రక్షాబంధన్ సందర్భంగా లాంచ్ చేయాలని ఆయనే తమకు సలహా ఇచ్చారంది. మరోవైపు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట. తమ శాఖ పథకమైన బేటీ బచావో, బేటీ పఢావో కి తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం బాగుందని కొనియాడినట్లు తెలిపారు ఫ్రిదా.
గర్ల్ రైజింగ్ను ప్రారంభించిన దగ్గరనుంచి ఇందులో తాను భాగమవుతున్నానని, ఈ శక్తిమంతమైన ఆలోచన భారత్కు విస్తరింపజేస్తే ఎంతో గౌరవం పొందుతానని, దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ప్రియాంక చెప్పారు. ఎక్కువ మంది బాలికలు విద్యావంతులైతే మొత్తం భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించ గలుగుతుందని అన్నారు.