బాలిక సాక్ష్యం.. ఇద్దరికి యావజ్జీవం
థానే: న్యాయస్థానంలో నిర్భయంగా ఓ బాలిక చెప్పిన సాక్ష్యం ఇద్దరు నేరస్తులకు శిక్ష పడేలా చేసింది. హత్య కేసులో తొమ్మదేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యంతో దోషులకు మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కామ్లిబాయ్ వాఘె(46), ఫారూఖ్ ఖాన్ లకు సెషెన్స్ కోర్టు జడ్జి విలాస్ వీ బామ్ బార్డె జీవితఖైదు విధించారు. మరో నిందితుడు విజయ్ పవార్(40)ను ‘సంశయ లాభం’ కింద విడుదల చేశారు.
భివాండీలోని గాయత్రినగర్ లో శివాజీ జాదవ్ అనే వ్యక్తి 2010, అక్టోబర్ 2న హత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో విజయ్ తన స్నేహితులతో కలిసినట్టు జాదవ్ ను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించినా ఎవరూ నిందితులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వలేదు. తొమ్మిదేళ్ల బాలిక మాత్రం నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దోషులకు కోర్టు శిక్ష విధించింది.