GJEPC
-
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు అంతంతే!
ముంబై: భారత్ మొత్తం రత్నాలు– ఆభరణాల ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా 2.48 శాతం పెరిగి రూ. 3,00,462.52 కోట్లకు (37,469 మిలియన్ డాలర్లు) చేరాయి. ఒక్క మార్చి నెల చూస్తే, ఏకంగా ఈ విలువ భారీగా 24 శాతం పడిపోయి రూ.21,502 (2,613 మిలియన్ డాలర్లు) కోట్లుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ విలువ రూ.28,198.36 కోట్లు (3,699.90 మిలియన్ డాలర్లు). ద్రవ్యోల్బణం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, దాదాపు ఆరు నెలల పాటు చైనాలో లాక్డౌన్ కారణంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆర్థిక సంవత్సరం మొత్తంగా స్వల్ప వృద్ధి నమోదుకావడానికి సకాలంలో జరిగిన భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కొంత దోహపదడింది. దీనితో ప్లైన్ గోల్డ్ జ్యూయలరీ 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే భారీగా 17 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ఎగుమతుల్లో 2.97 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో రూ.1,82,111 కోట్ల (24,434 మిలియన్ డాలర్లు) నుంచి రూ.1,76,697 కోట్లకు (22,045 మిలియన్ డాలర్లు) ఎగుమతుల విలువ తగ్గింది. ► అమెరికా–చైనాసహా భారత్ కీలక మార్కెట్లలో వజ్రాల డిమాండ్‌ను ప్రపంచ సవాళ్లు, అనిశ్చితి పరిస్థితులు ప్రభావితం చేశాయి. ► అయితే యూరప్ ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ బాగానే ఉంది. రష్యన్ వజ్రాల సరఫరాల్లో అనిశ్చితి, శుద్ధీకరణలో సవాళ్ల కారణంగా భారతదేశం ఇబ్బందులను ఎదుర్కొంది. ► రాబోయే నెలల్లో వజ్రాల రంగానికి స్థిరత్వం తిరిగి వస్తుందన్నది అంచనా. ముఖ్యంగా చైనా, దూర ప్రాశ్చ ఆసియాలో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని విశ్వాసం ఉంది. ► 2022 ఏప్రిల్ 2023 మార్చి మధ్య పసిడి ఆభరణాల ఎగుమతుల విలువ 11 శాతం పెరిగి రూ.75,636 కోట్లు (9,423 మిలియన్ డాలర్లు). 2021–22 ఆర్థిక సంవత్సరం మధ్య ఈ విలువ రూ.68,062.41 కోట్లు (9,130 మిలియన్ డాలర్లు). ► ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో వెండి ఆభరణాల ఎగుమతులు 16.02 శాతం పెరిగి రూ. 23,492.71 కోట్లకు (2,932 మిలియన్ డాలర్లు) పెరిగింది. 2021–22 ఇదే కాలంలో ఈ విలువ రూ. 20,248.09 కోట్లు (2,714.14 మిలియన్ డాలర్లు). -
సూరత్‌లో వజ్రాల సదస్సు
ముంబై: ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొనుగోలుదారులు, విక్రేతలు ప్రత్యక్షంగా డీల్స్ గురించి చర్చించుకోవచ్చని, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను కుదుర్చుకోవచ్చని వివరించింది. గత అయిదేళ్లుగా భారత్‌లో ఎల్జీడీ విభాగం గణనీయంగా పెరిగిందని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా వివరించారు. 2016–17లో 131 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2022 ఏప్రిల్–2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 1.5 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
3 నెలల్లో..రూ.77 వేల కోట్ల జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు!
న్యూఢిల్లీ: రత్నాభరణాల (జెమ్స్ అండ్ జ్యుయలరీ) ఎగుమతులు జూన్‌లో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 21.41 శాతం వృద్ధితో రూ.25,295 కోట్ల విలువ మేర ఎగుమతులు నమోదైనట్టు.. జెమ్ అండ్ జ్యులయరీ ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. 2021 జూన్ నెలలో ఎగుమతుల విలువ రూ.20,835 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) రత్నాభరణాల ఎగుమతులు 15 శాతం పెరిగి రూ.77,049 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన ఎగుమతులు రూ.67,231 కోట్లుగా ఉండడం గమనార్హం. యూఏఈతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (భారత్–యూఏఈ సీఈపీఏ) చేసుకున్న తర్వాత మధ్య ప్రాచ్యానికి ఎగుమతుల్లో సానుకూల వృద్ధి కనిపించినట్టు జీజేఈపీసీ వివరించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు జూన్‌లో 8 శాతానికి పైగా పెరిగి రూ.15,737 కోట్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు 35 శాతం వృద్ధితో రూ.5,641 కోట్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 35 శాతం పెరిగి రూ.6,258 కోట్లుగా ఉన్నాయి. యూఏఈతో ఒప్పందం ఫలితాలు ‘‘భారత్–యూఏఈ సీఈపీఏ మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే నెలలో ప్లెయిన్ గోల్డ్ జ్యుయలరీ ఎగుమతులు యూఏఈకి 72 శాతం పెరిగి రూ.1,048 కోట్లుగా ఉన్నాయి. జూన్‌లోనూ 68 శాతం పెరిగి రూ.1,451 కోట్లుగా ఉన్నాయి’’ అని జీజేఈపీసీ వెల్లడించింది. మొత్తం మీద ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూఏఈ వరకే ఎగుమతులు 10 శాతం వృద్ధితో రూ.9,803 కోట్లుగా నమోదయ్యాయి. ‘‘యూఏఈతో సీఈపీఏ ఒప్పందం వల్ల ప్లెయిన్ గోల్డ్ జ్యుయలరీ తక్షణమే లాభపడిన విభాగం. పరిమాణాత్మక మార్పును తీసుకొచ్చే విధానంతో మద్దతుగా నిలిచినందుకు వాణిజ్య శాఖకు ధన్యవాదాలు. ఈ ఒప్పందంలోని ప్రయోజనాలను భాగస్వాములు అందరూ వినియోగించుకుని లబ్ధి పొందాలి’’అని జీజేఈపీసీ చైర్మన్ కొలిన్ షా సూచించారు. -
మెరిసిన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారీగా 56 శాతం పురోగమించాయి. విలువలో ఈ పరిమాణం 39 బిలియన్ డాలర్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 25.40 బిలియన్ డాలర్లు. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021–22 మార్చిలో స్థూలంగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 3,393.29 మిలియన్ డాల ర్లు. 2020–21 ఇదే నెల్లో ఈ విలువ 3,409.07 మిలియన్ డాలర్లు. అంటే స్వల్పంగా 0.46 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ► గడచిన ఆర్థిక సంవత్సరం దేశం మొత్తం ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చురుకోగా ఇందులో 10వ వంతు సహకారం, రత్నాలు, ఆభరణాల రంగానికి కావడం హర్షణీయం. ► మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతులలో కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్ సెగ్మెంట్ భారీగా 62 శాతం వాటాను పొందింది. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), బెల్జియం, ఇజ్రాయెల్ నుండి బలమైన డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో ఇటీవల వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకం చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. దీనివల్ల ఈ కీలకమైన వృద్ధి మార్కెట్ల మంచి అవకాశాలను పొందడానికి ఈ రంగం సిద్ధమవుతుంది. ఆయా దేశాల్లో డిమాండ్‌లో తగిన ప్రాధాన్యతను పొందేందుకు సిద్ధంగా ఉంది. ► 2021–22లో అన్ని రకాల స్టడెడ్ బంగారు ఆభరణాల షిప్మెంట్లు అంతకుముందు సంవత్సరంలో 2,768.97 మిలియన్ డాలర్లతో పోలిస్తే 95 శాతం వృద్ధిని సాధించి 5,352.52 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ► 2021–22లో వెండి ఆభరణాల స్థూల ఎగుమతులు 2,721.87 మిలియన్ డాలర్లు. 2020–21లో ఈ విలువ 2336.82 మిలియన్ డాలర్లు. ► రత్నాల స్థూల ఎగుమతుల 2021–22లో 66.82 శాతం వృద్ధితో 311.41 మిలియన్ డాలర్లకు చేరాయి. 2020–21లో ఈ విలువ 188.66 మిలియన్ డాలర్లు. లక్ష్యంలో భాగస్వామ్యం గ్లోబల్ మార్కెట్లకు భారతదేశం ఎగుమతులు 56 శాతం పుంజుకున్నాయి. ఇది ఈ రంగానికి శుభ పరిణామం. కో విడ్ లాక్డౌన్ సడలింపులు, మంచి డిమాండ్, అనిశ్చిత వ్యాపార వాతావరణ పరిస్థితి ఉపశమనానికి ప్రభుత్వ చర్యలు ఈ రంగం ఎగుమతులు పురోగమించడానికి కారణం. ప్రభుత్వ 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నెరవేర్చడంలో మా పరిశ్రమ పెద్ద ఎత్తున దోహదపడింది. కొన్ని అదనపు అవసరమైన విధాన మద్దతు చర్యలు పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి. – కోలిన్ షా, జీజేఈపీసీ చైర్మన్ -
భారత్‌లో బంగారం మెరుపు
న్యూఢిల్లీ: స్వల్ప ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, బంగారం దిగుమతుల్లో భారత్ తన హవాను కొనసాగిస్తోంది. 2021లో 1,067 టన్నుల దిగుమతులు చేసుకుంది. కోవిడ్–19 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న 2020లో ఈ పరిమాణం కేవలం 430.11 టన్నులు. 2019తో పోల్చిచూస్తే, 28 శాతం పెరిగి 836.38 టన్నులుగా నమోదయ్యింది. రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) నివేదిక ఒకటి అంశాలను వెల్లడించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - స్విట్జర్లాండ్ నుంచి 2021లో అత్యధికంగా 469.66 టన్నుల పసిడి దిగుమతులు జరిగాయి. వరుసలో తరువాతి మూడు స్థానాల్లో యూఏఈ (120.16 టన్నులు), దక్షిణాఫ్రికా (71.68 టన్నులు), గినియా (68.72 టన్నులు) ఉన్నాయి. - 2015లో దేశం 1,047 టన్నుల పసిడిని దిగుమతి చేసుకోగా, 2017లో 1,032 టన్నుల దిగుమతులు చేసుకుంది. అటు తర్వాత ఈ స్థాయి దిగుమతులు ఇదే తొలిసారి. - 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ చూస్తే, భారత్ సగటు నెలవారీ పసిడి దిగుమతులు నెలకు 76.57 టన్నులు. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరం దిగుమతులకు ఇది దాదాపు సరిసమానం. అంటే మొత్తంగా ఈ పరిమాణం 842.28 టన్నులు. - ఎగుమతుల విషయానికొస్తే, 2021లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో భారతదేశం నుండి ఈ విభాగం నుంచి రవాణా 50 శాతం పెరిగి 8,807.50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2020లో ఈ విలువ 5,876.39 మిలియన్ డాలర్లు. ఒక్క స్టడెడ్ గోల్డ్ ఆభరణాల ఎగుమతులు ఇదే కాలంలో 2,508.26 మిలియన్ డాలర్ల నుంచి 5,078.83 మిలియన్ డాలర్లకు ఎగసింది. ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల విలువ 3,369.13 మిలియన్ డాలర్ల నుంచి 3,728.66 మిలియన్ డాలర్లకు చేరింది. చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..! -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి పది నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) 32.37 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జరిగాయి. 2020–21 ఇదే కాలంతో పోలి్చతే (30.40 బిలియన్ డాలర్లు) ఈ విలువ 6.5 శాతం అధికం. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ఒకటి ఈ అంశాలను తెలిపింది. ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతుల రంగం కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూపాయిల్లో ఎగుమతుల విలువ 12.28 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరితే, డాలర్ల రూపంలో 6.5 శాతం ఎగసి 32.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్య ఈ విలువలు వరుసగా రూ.2.14 లక్షల కోట్లు, 30.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► భారత్ ఎగుమతులకు తొలి మూడు ప్రధాన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (41.50 శాతం), బెల్జియం (15.81 శాతం), జపాన్ (12.20 శాతం) ఉన్నాయి. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో ఆ దేశానికి భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మరింత పెరుగుతాయి. ► మ్తొతం మధ్యప్రాచ్యం మార్కెట్లోకి ప్రవేశించడానికి యూఏఈ ప్రధాన కేంద్రంగా (గేట్‌వే) ఉంది. ఈ నేపథ్యంలో భారత్–యూఏఈ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం బహుళ ప్రయోజనాలను చేకూర్చుతుంది. సుంకాలు రద్దు చేయాలి భారతదేశం నుండి బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులపై యూఏఈలో 5 శాతం దిగుమతి సుంకాన్ని రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రకటన కోరింది. ప్రకటన ప్రకారం, సుంకాలు లేని పరిస్థితుల్లో భారత్ నుంచి యూఏఈకి ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ, గోల్డ్ స్టడెడ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ 2023 నాటికి 10 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.74,000 కోట్లు) చేరుతుంది. భారత్ ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల ఎగుమతుల్లో యూఏఈ వాటా 80 శాతం. స్టడెడ్ జ్యూయలరీకి సంబంధించి ఈ వాటా 20 శాతంగా ఉంది. కాగా, బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 2021 ఏప్రిల్–2022 జనవరి మధ్య 24.24 శాతం క్షీణించి, 7.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ కూడా భారీగా 56 శాతం పడిపోయి 3.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
బంగారం అమ్మకాలు పెరగాలి, ఏం చేయాలో చెప్పండి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ఆభరణాల పరిశ్రమల మరింత పురోగమించడానికి తగిన చర్యలు లక్ష్యంగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ), రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. ఒప్పందం ప్రకారం... ఈ ఏడాది రెండు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భారీగా మల్టీ మీడియా మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తాయి. భారత వినియోగదారుల్లో ముఖ్యంగా యువతలో పసిడి ఆభరణాల, నాణ్యత, ధరల విధానం విషయంలో అవగాహన పెంచడం దీని లక్ష్యం. యల్లో మెటల్ భవిష్యత్ సంపదగా ఎలా ఉంటుందన్న అంశాన్ని మహిళల్లో అవగాహన కల్పిస్తారు. -
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్‌కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్‌మార్కింగ్‌తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్‌మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్‌లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
కరోనా షాక్: తగ్గిన జువెల్లరీ ఎగుమతులు
సాక్షి,ముంబై: 2020-21లో జెమ్స్ అండ్ జువెల్లరీ పరిశ్రమ ఎగుమతులు 25.71శాతం తగ్గి రూ.1,85,952.34 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్, ప్రయాణ ఆంక్షలే ఈ క్షీణతకు కారణమని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 2019–20లో ఈ పరిశ్రమ స్థూల ఎగుమతులు రూ.2,50,319.89 కోట్లుగా ఉన్నాయి. (మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!) జువెల్లరీ పరిశ్రమకు 2020-21అసాధారణ సంవత్సరమని..కొంతకాలంగా సాధారణ పరిస్థితులు నెలకోవటంతో రెండో అర్ధసంవత్సరంలో ఎగుమతుల్లో రికవరీ నమోదయిందని పేర్కొంది. తొలి మూడు త్రైమాసికాల్లో క్షీణత కనిపించగా.. నాల్గో త్రైమాసికంలో మాత్రం 12.73 శాతం వృద్ధి నమోదయిందని జీజేఈపీసీ చైర్మన్ కోలిన్ షా తెలిపారు. కట్ అండ్ పాలిష్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు గత ఆర్ధిక సంవత్సరంలో 8.87 శాతం తగ్గి రూ.1,32,015.25 కోట్ల నుంచి రూ.1,20,302.04 కోట్లకు చేరాయి. బంగారు ఆభరణాల ఎగుమతులు 57.89 శాతం క్షీణించి రూ.84,270.81 కోట్ల నుంచి రూ.35,483.17 కోట్లకు తగ్గాయి. వెండి ఆభరణాల ఎక్స్‌పోర్ట్స్ మాత్రం వృద్ధి చెందాయి. 43.55 శాతం పెరిగి రూ.11,955.75 కోట్ల నుంచి రూ.17,163.03 కోట్లకు వృద్ధి చెందాయి -
పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గించండి
కేంద్రాన్ని కోరిన జీజేఈపీసీ న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది. దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలన్న నిబంధన (80:20 ఫార్ములా)ను రద్దుచేయాలని కోరింది. జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా బుధవారం న్యూఢిల్లీలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం 10% దిగుమతి సుంకం విధిస్తుండడంతో బంగారం అక్రమ రవాణాయే లాభదాయకంగా మారిందని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా స్మగ్లింగ్‌ను నిరోధించవ్చని పేర్కొన్నారు. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన దృష్ట్యా 80:20 ఫార్ములా రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచడంతో 2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నారు. -
70 శాతం తగ్గిన పుత్తడి ఆభరణాల ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ బంగారు అభరణాల ఎగుమతులు గత నెలలో 70 శాతం తగ్గాయని జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తెలిపింది. బంగారం కొరతగా ఉండడం, దేశీయ మార్కెట్లో పరిమిత నిల్వల కారణంగా పుత్తడి ఆభరణాల ఎగుమతులు 70 శాతం క్షీణించి 44.14 కోట్ల డాలర్లకు తగ్గాయని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు. జీజేఈపీసీ వెల్లడించిన వివరాల ప్రకారం...., గత ఏడాది జూలైలో 150 కోట్ల డాలర్ల బంగా రం ఎగుమతులు జరిగాయి. బంగారం మెడళ్లు, నాణాలు ఎగమతులు 63 శాతం క్షీణించి 11.28 కోట్ల డాలర్లకు తగ్గాయి. అయితే వెండి ఆభరణాల ఎగుమతులు మాత్రం జోరుగా పెరిగాయి. ఈ ఎగుమతులు 184% వృద్ధితో 11 కోట్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద భారత దేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 17% క్షీణించి 249 కోట్ల డాలర్లకు తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్ -జూలై కాలానికి ఈ ఎగుమతులు 14 శాతం క్షీణించి 1,100 కోట్ల డాలర్లకు చేరాయి. {పభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడంతో ఆభరణాల తయారీకి అవసరమైన పుత్తడి కొరత తీవ్రంగా ఉంది. {పపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం మనదే.