
న్యూఢిల్లీ: భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి పది నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) 32.37 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జరిగాయి. 2020–21 ఇదే కాలంతో పోలి్చతే (30.40 బిలియన్ డాలర్లు) ఈ విలువ 6.5 శాతం అధికం. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ఒకటి ఈ అంశాలను తెలిపింది. ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతుల రంగం కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూపాయిల్లో ఎగుమతుల విలువ 12.28 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరితే, డాలర్ల రూపంలో 6.5 శాతం ఎగసి 32.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్య ఈ విలువలు వరుసగా రూ.2.14 లక్షల కోట్లు, 30.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
► భారత్ ఎగుమతులకు తొలి మూడు ప్రధాన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (41.50 శాతం), బెల్జియం (15.81 శాతం), జపాన్ (12.20 శాతం) ఉన్నాయి.
► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో ఆ దేశానికి భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మరింత పెరుగుతాయి.
► మ్తొతం మధ్యప్రాచ్యం మార్కెట్‌లోకి ప్రవేశించడానికి యూఏఈ ప్రధాన కేంద్రంగా (గేట్‌వే) ఉంది. ఈ నేపథ్యంలో భారత్–యూఏఈ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం బహుళ ప్రయోజనాలను చేకూర్చుతుంది.
సుంకాలు రద్దు చేయాలి
భారతదేశం నుండి బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులపై యూఏఈలో 5 శాతం దిగుమతి సుంకాన్ని రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రకటన కోరింది. ప్రకటన ప్రకారం, సుంకాలు లేని పరిస్థితుల్లో భారత్ నుంచి యూఏఈకి ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ, గోల్డ్ స్టడెడ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ 2023 నాటికి 10 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.74,000 కోట్లు) చేరుతుంది. భారత్ ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల ఎగుమతుల్లో యూఏఈ వాటా 80 శాతం. స్టడెడ్ జ్యూయలరీకి సంబంధించి ఈ వాటా 20 శాతంగా ఉంది. కాగా, బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 2021 ఏప్రిల్–2022 జనవరి మధ్య 24.24 శాతం క్షీణించి, 7.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ కూడా భారీగా 56 శాతం పడిపోయి 3.2 బిలియన్ డాలర్లకు తగ్గింది.