పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గించండి
కేంద్రాన్ని కోరిన జీజేఈపీసీ
న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని 10 నుంచి 2 శాతానికి తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) కేంద్రాన్ని కోరింది. దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలన్న నిబంధన (80:20 ఫార్ములా)ను రద్దుచేయాలని కోరింది. జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా బుధవారం న్యూఢిల్లీలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.
ప్రస్తుతం 10% దిగుమతి సుంకం విధిస్తుండడంతో బంగారం అక్రమ రవాణాయే లాభదాయకంగా మారిందని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా స్మగ్లింగ్‌ను నిరోధించవ్చని పేర్కొన్నారు. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన దృష్ట్యా 80:20 ఫార్ములా రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని గతేడాది ఆగస్టు నుంచి 10 శాతానికి పెంచడంతో 2013-14లో ఈ రెండు లోహాల దిగుమతులు 40% క్షీణించాయన్నారు.