ముంబై: భారత్ మొత్తం రత్నాలు– ఆభరణాల ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా 2.48 శాతం పెరిగి రూ. 3,00,462.52 కోట్లకు (37,469 మిలియన్ డాలర్లు) చేరాయి. ఒక్క మార్చి నెల చూస్తే, ఏకంగా ఈ విలువ భారీగా 24 శాతం పడిపోయి రూ.21,502 (2,613 మిలియన్ డాలర్లు) కోట్లుగా నమోదయ్యింది.
2022 మార్చిలో ఈ విలువ రూ.28,198.36 కోట్లు (3,699.90 మిలియన్ డాలర్లు). ద్రవ్యోల్బణం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, దాదాపు ఆరు నెలల పాటు చైనాలో లాక్‌డౌన్ కారణంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► ఆర్థిక సంవత్సరం మొత్తంగా స్వల్ప వృద్ధి నమోదుకావడానికి సకాలంలో జరిగిన భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కొంత దోహపదడింది. దీనితో ప్లైన్ గోల్డ్ జ్యూయలరీ 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే భారీగా 17 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
► 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ఎగుమతుల్లో 2.97 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో రూ.1,82,111 కోట్ల (24,434 మిలియన్ డాలర్లు) నుంచి రూ.1,76,697 కోట్లకు (22,045 మిలియన్ డాలర్లు) ఎగుమతుల విలువ తగ్గింది.
► అమెరికా–చైనాసహా భారత్ కీలక మార్కెట్లలో వజ్రాల డిమాండ్‌ను ప్రపంచ సవాళ్లు, అనిశ్చితి పరిస్థితులు ప్రభావితం చేశాయి.
► అయితే యూరప్ ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ బాగానే ఉంది. రష్యన్ వజ్రాల సరఫరాల్లో అనిశ్చితి, శుద్ధీకరణలో సవాళ్ల కారణంగా భారతదేశం ఇబ్బందులను ఎదుర్కొంది.
► రాబోయే నెలల్లో వజ్రాల రంగానికి స్థిరత్వం తిరిగి వస్తుందన్నది అంచనా. ముఖ్యంగా చైనా, దూర ప్రాశ్చ ఆసియాలో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని విశ్వాసం ఉంది.
► 2022 ఏప్రిల్ 2023 మార్చి మధ్య పసిడి ఆభరణాల ఎగుమతుల విలువ 11 శాతం పెరిగి రూ.75,636 కోట్లు (9,423 మిలియన్ డాలర్లు). 2021–22 ఆర్థిక సంవత్సరం మధ్య ఈ విలువ రూ.68,062.41 కోట్లు (9,130 మిలియన్ డాలర్లు).
► ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో వెండి ఆభరణాల ఎగుమతులు 16.02 శాతం పెరిగి రూ. 23,492.71 కోట్లకు (2,932 మిలియన్ డాలర్లు) పెరిగింది. 2021–22 ఇదే కాలంలో ఈ విలువ రూ. 20,248.09 కోట్లు (2,714.14 మిలియన్ డాలర్లు).
Comments
Please login to add a commentAdd a comment