సంగీత ప్రియులకు పండుగొచ్చింది
లండన్: ప్రపంచ సంగీత ప్రియులకు పండుగొచ్చింది. ప్రపంచంలోనే అతి భారీ ఎత్తున జరిగే సంగీత విభావరికి శుక్రవారం నాడు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని పిల్టన్‌లో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'గ్లాస్టన్‌బరి ఫెస్టివల్'కు ప్రపంచ నలుమూలల నుంచి సంగీత ప్రియులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మున్నెన్నడు లేనివిధంగా గురువారం ఉదయానికే దాదాపు రెండు లక్షల మంది సంగీత ప్రియులు పిల్టన్‌లోని సంగీత కచేరి మైదానానికి చేరుకున్నారు. నిర్వాహకులు 1,35.000 టిక్కెట్లు విక్రయించి కౌంటర్ మూసేసినప్పటికీ సంగీత ప్రియుల ప్రవాహానికి మాత్రం తెరపడడం లేదు. టిక్కెట్లు లేకపోయిన సంగీతోత్సవానికి వారు రావడం మామూలే. వారంత కచేరి ప్రాంతంలో కాకుండా చుట్టుపక్క ప్రాంతాల్లో వీకెండ్‌ను అహ్లాదంగా గడిపి వెళతారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఐదు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవంలో రాక్, పాప్, ఇండీ రాక్, ట్రిప్ హాప్, హిప్ హాప్, రెగ్గీ, ఫోక్, వరల్డ్ మ్యూజిక్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, హెవీ మెటల్ మ్యూజిక్ ఇలా ప్రపంచంలోని అనేక రీతుల సంగీతాన్ని వినిపిస్తారు. వీటికి సైడ్‌లైడ్స్‌గా ప్రేక్షకుల మధ్య డాన్స్, కామెడీ, థియేటర్, సర్కస్, క్యాబె రే లాంటి కార్యక్రమాలు అసలు సంగీత కార్యక్రమానికి ముందూ వెనక, ప్రేక్షకుల మధ్య కొనసాగుతాయి. వివిధ సంగీత రీతుల్లో వర్ధమాన తారలుగా ఎదుగుతున్న మ్యుజిషన్స్, కంపోజర్స్ ఈ వేదిక నుంచి ఒక్కసారైనా పాడేందుకు పోటీ పడతారు. పాటల రచయితలు కూడా ఈ వేదిక కోసం ప్రత్యేకంగా పాటలు రాస్తారు. పిల్టన్‌లోని 900 ఎకరాల్లో కొనసాగే ఈ సంగీతోత్సవంలో ప్రధాన వేదికతోపాటు చుట్టూర మరో 12 వేదికలు ఉంటాయి.
ప్రధాన స్టేజీపై 6,50.000 వాట్స్ సామర్ధ్యంగల 250 స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సంగీత ప్రియులు ఎవరి టెంట్లు వారే, వారానికి సరపడే దుస్తులు తెచ్చుకోవాలి. మంచినీరు, టాయ్‌లెట్ సౌకర్యాన్ని మాత్రం నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. నాలుగువేల టాయ్లెట్లను ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ల్యాండ్ యజమాని మైకేల్ ఏవిస్ తెలిపారు.
1971లో ప్రారంభమైన గ్లాస్టన్‌బరి సంగీతోత్సవం మధ్యలో కొంత విరామం తర్వాత ఇప్పుడు ప్రతిఏటా జరుగుతోంది. ఈసారి మాత్రం ఊహించనిదానికన్నా ఎక్కువగా ఉందని కార్యక్రమం నిర్వహణలో తండ్రికి సహకరిస్తున్న ఎమిలీ ఎవిస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చే సొమ్ములో ఎక్కువ భాగాన్ని ఎప్పటిలాగే సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆమె తెలిపారు. ఈ సంగీతోత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి కెమికల్ బ్రదర్స్, రూడిమెంటల్, జార్జి ఎజ్రా, లివెల్ రిచ్, ఆల్ట్ జే, పలోమా ఫేత్ లాంటి వర్ధమాన స్టార్స్ వస్తున్నారని ఆమె చెప్పారు.