ట్రంప్‌ను హత్యచేయబోయేది ఎవరు?
- అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి స్టార్ హీరో జానీ డెప్ సంచలన వ్యాఖ్యలు
పిల్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ వివాదాస్ప వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త సినిమా ‘ది లిబర్టైన్’ ప్రమోషన్ కోసం పిల్టన్(ఇంగ్లాండ్)లో జరుగుతోన్న ‘గ్లాస్టోన్‌బరీ ఫెస్టివల్’కు హాజరైన ఆయన.. వేదికపై నుంచి ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించాడు. 1865లో నాటి యూఎస్ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ను నటుడు జాన్ విల్కీస్ బూత్ హత్యచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ..
‘ఫ్రెండ్స్.. నేను మాట్లాడబోయేది వివాదాస్పదం అవుతుందని తెలుసు. అయినా సరే, ట్రంప్ ఇక్కడికొస్తారా? ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎవరైనా సహాయం చేస్తారా? అన్నట్లు.. చివరిసారిగా అధ్యక్షుణ్ని చంపిన నటుడు ఎవరో గుర్తుందా? మీకు స్పష్టం చేయాల్సిన ఇంకో విషయమేంటంటే.. నేను నటుణ్ని కాదు. ఏదో బతకడానికి అబద్ధాలు చెప్పేవాణ్ని మాత్రమే’ అని జానీ డెప్ వ్యాఖ్యానించాడు.
హీరో వ్యాఖ్యలపై ఇంటెలిజెన్స్ ఆరా
పరాయిదేశం(ఇంగ్లాండ్)లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ హత్య గురించి జానీ డెప్ మాట్లాడంపై అమెరికన్‌ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దృష్టిసారించాయి. హీరో వ్యాఖ్యలను పరిశీలించిన పిదప ఎందుకిలా మాట్లాడాల్సి వచ్చిందో ఆయనను వివరణ అడుగుతామని యూఎస్ ఇంటెలిజెన్స్‌అధికారి ఒకరు చెప్పారు. అటు సోషల్ మీడియాలోనూ జానీ వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగింది.
ఇది మొదటిసారికాదు..
జానీ డెప్.. డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారికాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి పలు సందర్భాల్లో వ్యతిరేక గళం వినిపించారు. అంతటితో ఆగకుండా ‘డొనాల్డ్ ట్రంప్స్ ది ఆర్ట్ ఆఫ్ ది డీల్’ అనే సెటైరికల్ సినిమా కూడా తీశారు. 50 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాలో జానీ డెప్.. డొనాల్డ్ ట్రంప్ పాత్రను పోశించారు.