Global health city
-
ఈ వారమంతా ఐపీవోల హవా..
న్యూఢిల్లీ: ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ ఈ వారం మరింత కళకళలాడనుంది. నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపడుతున్నాయి. ఈ జాబితాలో మెడంటా బ్రాండుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ లిమిటెడ్, సూక్ష్మ రుణాల సంస్థ ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్, కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీస్ తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్, స్నాక్స్ తయారీ కంపెనీ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా రూ. 4,700 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. వీటితోపాటు నవంబర్లోనే యూనిపార్ట్స్ ఇండియా, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ సైతం ఐపీవోలకు రానున్నాయి. వివరాలు చూద్దాం.. 31 నుంచి షురూ సోమవారం(31) నుంచి ప్రారంభమైన డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 2న ముగియనుంది. నవంబర్ 2న మొదలుకానున్న ఫ్యూజన్ మైక్రో ఇష్యూ 4న ముగియనుంది. ఈ బాటలో గ్లోబల్ హెల్త్, బికాజీ ఫుడ్స్ ఐపీవోలు నవంబర్ 3న ప్రారంభమై 7న ముగియనున్నాయి. 2022లో ఇప్పటివరకూ 22 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 44,000 కోట్లు సమకూర్చుకున్నాయి. 2021లో మొత్తం 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 197–207 ధరలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 225 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయ నుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1,36,95,466 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 350–368 ధరలో చేపడు తున్న ఇష్యూ ద్వారా రూ. 1,104 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను మైక్రోఫైనాన్స్ మూలధన బలిమికి వినియోగించనుంది. గ్లోబల్ హెల్త్ ఐపీవోలో భాగంగా గ్లోబల్ హెల్త్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత వాటాదారులు 5.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 319–336 ధరలో చేపడుతున్న ఇష్యూ ద్వారా రూ. 2,206 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బికాజీ ఫుడ్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 285–300 ధరల శ్రేణిని బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ తాజాగా ప్రకటించింది. తద్వారా రూ. 881 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.94 కోట్ల షేర్ల ను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ వార్షికంగా 29,380 టన్నుల బికనీర్ భుజియా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యాకేజ్డ్ రసగుల్లా, సోన్ పాపి డి, గులాబ్ జామూన్ తదితరాలను సైతం తయా రు చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రిటైలర్ల ఆసక్తి సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రైమరీ మార్కెట్ మందగించే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అయితే కొత్త కంపెనీలలో పెట్టుబడి అవకాశాలపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తిని ప్రదర్శిస్తుండటంతో ఇష్యూలు సక్సెస్ అవుతున్నట్లు తెలియజేశారు. సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు వివరించారు. -
ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్ ఇష్యూలకు పోటాపోటీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ సైతం ఉంది. వివరాలు చూద్దాం.. గ్లోబల్ హెల్త్ రెడీ మేడాంటా బ్రాండ్ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ 4.33 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్ సచ్దేవ, సుమన్ సచ్దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వీడా క్లినికల్‌కు సై క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్ రీసెర్చ్ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్వే ఇన్వెస్ట్మెంట్ రూ. 260 కోట్లు, బసిల్ ప్రయివేట్ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. రెయిన్బో చిల్డ్రన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ రెయిన్బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్ కంపెనీ సీడీసీ గ్రూప్ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్ సేవలు అందిస్తోంది. వీనస్ పైప్స్ ట్యూబ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది. క్యాపిల్లరీ టెక్నాలజీస్ క్లౌడ్ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్(శాస్)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ విక్రయానికి ఉంచనుంది. వార్బర్గ్ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్కామ్ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది. -
500 కోట్ల టీకా డోసులు
రోమ్: వచ్చే ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి భారత్ తనవంతు సాయం కచ్చితంగా అందిస్తుందని తెలిపారు. తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఆయన శనివారం రోమ్‌లో ప్రారంభమైన జి–20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సులో ‘గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్’ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్ పోషిస్తున్న పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక యంత్రాంగం ఉండాలని సూచించారు. భారత్‌లో దేశీయంగానే అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జి న్’కు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వద్ద పెండింగ్‌లో ఉందని మోదీ గుర్తుచేశారు. త్వరగా అనుమతి లభిస్తే ఇతర దేశాలకు టీకాల విషయంలో సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి 150 దేశాలకు అవసరమైన అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు పంపించామని వివరించారు. సాహసోపేత ఆర్థిక సంస్కరణలు కనిష్ట కార్పొరేట్ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను శ్రీకారం చుట్టామన్నారు. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంతోపాటు ఆరోగ్య రంగంలో భవిష్యత్తుల్లో తలెత్తబోయే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ దిశగా ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు. రోమ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా మీడియాకు తెలియజేశారు. పేద దేశాలకు మరిన్ని టీకాలు: ఇటలీ ప్రధాని ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జి–20 శిఖరాగ్ర సదస్సు శనివారం ఇటలీ రాజధాని రోమ్‌లోని నువొలా కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యింది. అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ప్రారంభోపన్యాసం చేశారు. జి–20 దేశాల అధినేతలకు స్వాగతం పలికారు. పేద దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లు మరిన్ని అందించాలని జి–20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకాల పంపిణీ విషయంలో ధనిక దేశాలు, పేద దేశాల మధ్య అంతరం నైతికంగా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇప్పటివరకు కేవలం 3 శాతం మందికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని గుర్తుచేశారు. ఇక ధనిక దేశాల్లో 70 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. శిఖరాగ్ర సదస్సులో తొలిరోజు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక రంగాలపై చర్చించారు. ఈ సదస్సు ఆదివారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. -
చిన్నారి జ్ఞానసాయికి చికిత్స ప్రారంభం
చెన్నై: పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిట్టితల్లి జ్ఞానసాయికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో వైద్య చికిత్స అందిస్తున్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహ్మద్ రేల పర్యవేక్షణలో వైద్య బృందం పరీక్షల్ని వేగవంతం చేసింది. 20 రోజుల్లోపు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు తగిన చర్యలు తీసుకోనున్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరి కోట పంచాయతీ బత్తలాపురం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల ఎనిమిది నెలల కుమార్తె జ్ఞానసాయి కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన స్థోమత లేకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రమణప్ప కోర్టును ఆశ్రయించారు. వ్యవహారం మీడియాలో రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు తగ్గ చర్యలు తీసుకోవాలని గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రవీంద్రనాథ్‌కు సూచించడంతో, చిన్నారిని చెన్నైకు తరలించారు. సోమవారం జ్ఞానసాయిని రమణప్ప, సరస్వతి దంపతులు పెరుంబాక్కంలోని గ్లోబల్ హెల్త్ సిటీకి తీసికెళ్లారు. వారి వెంట ములకలచెరువు ఎంపీపీ ఆషాబీ ఉన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహ్మద్ రేల పర్యవేక్షణలో కాలేయ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ నరేష్ షణ్ముగం బృందం వైద్య పరీక్షలు వేగవంతం చేసింది. దీనిపై ఆ హెల్త్‌సిటీ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి, తమ చైర్మన్ రవీంద్రనాథ్ ఆదేశాలతో జ్ఞానసాయికి వైద్య పరీక్షలు వేగవంతం చేశామన్నారు. చిన్నారి చలాకీగా ఉన్న దష్ట్యా, ఔట్ పేషెంట్‌గా పరిగణించి చికిత్సలు అందించేందుకు నిర్ణయించామని వివరించారు. స్క్రీనింగ్, ఇతర పరీక్షలు సాగుతున్నాయన్నారు. కాలేయం దానానికి సంబంధించి, ఆ చిన్నారి తల్లిదండ్రులకు పరీక్షల జరపనున్నామని, వారి కాలేయం సరిపడే అవకాశాలు ఎక్కువే అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు వారం పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని, తదుపరి అనుమతులకు మరో ఐదు రోజులు పట్టవచ్చన్నారు. 20 రోజుల్లోపు చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతుందని స్పష్టం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన చిన్న పిల్లలకు డాక్టర్ రేల శస్త్ర చికిత్సలను విజయవంతం చేశారని, జ్ఞానసాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిన్నారి తండ్రి రమణప్ప మాట్లాడుతూ జ్ఞానసాయిని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా అప్పగించాలని వైద్యులకు విన్నవించామన్నారు.