ఈ వారమంతా ఐపీవోల హవా.. | IPOs of Bikaji Foods, Medanta, Fusion Microfinance, DCX | Sakshi
Sakshi News home page

ఈ వారమంతా ఐపీవోల హవా..

Published Tue, Nov 1 2022 5:47 AM | Last Updated on Tue, Nov 1 2022 5:47 AM

IPOs of Bikaji Foods, Medanta, Fusion Microfinance, DCX - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్‌ ఈ వారం మరింత కళకళలాడనుంది. నాలుగు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపడుతున్నాయి. ఈ జాబితాలో మెడంటా బ్రాండుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్, సూక్ష్మ రుణాల సంస్థ ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌ లిమిటెడ్, కేబుళ్లు, వైర్‌ హార్నెస్‌ అసెంబ్లీస్‌ తయారీ కంపెనీ డీసీఎక్స్‌ సిస్టమ్స్, స్నాక్స్‌ తయారీ కంపెనీ బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా రూ. 4,700 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. వీటితోపాటు నవంబర్‌లోనే యూనిపార్ట్స్‌ ఇండియా, ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ సైతం ఐపీవోలకు రానున్నాయి. వివరాలు చూద్దాం..

31 నుంచి షురూ  
సోమవారం(31) నుంచి ప్రారంభమైన డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నవంబర్‌ 2న ముగియనుంది. నవంబర్‌ 2న మొదలుకానున్న ఫ్యూజన్‌ మైక్రో ఇష్యూ 4న ముగియనుంది. ఈ బాటలో గ్లోబల్‌ హెల్త్, బికాజీ ఫుడ్స్‌ ఐపీవోలు నవంబర్‌ 3న ప్రారంభమై 7న ముగియనున్నాయి. 2022లో ఇప్పటివరకూ 22 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 44,000 కోట్లు సమకూర్చుకున్నాయి. 2021లో మొత్తం 63 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టి రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే.  

డీసీఎక్స్‌ సిస్టమ్స్‌
ఐపీవోలో భాగంగా డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 197–207 ధరలో పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 225 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది.

ఫ్యూజన్‌ మైక్రో ఫైనాన్స్‌
ఐపీవోలో భాగంగా ఫ్యూజన్‌ మైక్రో ఫైనాన్స్‌ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయ నుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1,36,95,466 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 350–368 ధరలో చేపడు తున్న ఇష్యూ ద్వారా రూ. 1,104 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను మైక్రోఫైనాన్స్‌ మూలధన బలిమికి వినియోగించనుంది.

గ్లోబల్‌ హెల్త్‌
ఐపీవోలో భాగంగా గ్లోబల్‌ హెల్త్‌ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత వాటాదారులు 5.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 319–336 ధరలో చేపడుతున్న ఇష్యూ ద్వారా రూ. 2,206 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

బికాజీ ఫుడ్‌
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 285–300 ధరల శ్రేణిని బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా ప్రకటించింది. తద్వారా రూ. 881 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.94 కోట్ల షేర్ల ను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ వార్షికంగా 29,380 టన్నుల బికనీర్‌ భుజియా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యాకేజ్‌డ్‌ రసగుల్లా, సోన్‌ పాపి డి, గులాబ్‌ జామూన్‌ తదితరాలను సైతం తయా రు చేస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  

రిటైలర్ల ఆసక్తి
సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రైమరీ మార్కెట్‌ మందగించే వీలున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. అయితే కొత్త కంపెనీలలో పెట్టుబడి అవకాశాలపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తిని ప్రదర్శిస్తుండటంతో ఇష్యూలు సక్సెస్‌ అవుతున్నట్లు తెలియజేశారు. సంపన్న వర్గాలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement