రేపు హెచ్‌సీయూ స్నాతకోత్సవం
1443 మందికి పట్టాలు ప్రదానం
ఆరుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు
16వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ ముస్తాబు
సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవం బుధవారం జరుగనుంది. 1443 పట్టాలను విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆరుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు అందించేందుకు యూనివర్సిటీ నిర్ణయించింది. అక్టోబర్ 1న గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హెచ్‌సీయూ 16వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పీహెచ్డీ విభాగంలో 184, ఎంటెక్‌లో 165, ఎంఫిల్‌లో 180, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీలో 914 డిగ్రీలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 104 మెడల్స్‌ను అందించనున్నారు. దీనిలో 29 యూనివర్సిటీ మెడల్స్, 31 ఎస్సీ, ఎస్టీ విభాగ మెడల్స్, 44 దాతల మెడల్స్ విద్యార్థులకు ప్రదానం చేయనున్నారు. 2013-14 విద్యా సంవత్సరానికి 1011 డిగ్రీలు ప్రదానం చేయగా, ఈ సారి ఆ సంఖ్య 1443కి పెరిగింది. హెచ్‌సీయూలో 33 స్కూళ్లలో 133 కోర్సులు నిర్వహిస్తున్నారు. దాదాపు 5000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఆరుగురికి గౌరవ డాక్టరేట్లు...
వివిధ విభాగాల్లో ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. వీరిలో ప్రముఖ రచయిత, పద్మభూషణ్ గుల్జార్, హెచ్‌సీయూ మాజీ వీసీ, భౌతిక శాస్త్ర వేత్త పల్లె రామారావు, పద్మవిభూషణ్, కార్డియో సర్జన్ డాక్టర్ ఎంఎస్ వలియాతన్, ప్రముఖ గణిత శాస్త్ర వేత్త ఎంఎస్ రఘునాథన్, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి కపిల వాత్సాయన్, దివంగత మాజీ నటి, పద్మవిభూషణ్ జోహ్రా సెహగల్లకు గౌరవ డాక్టరేట్లు అందజేయనున్నారు. సెహగల్ స్థానంలో ఆమె కూతురు కిరణ్ సెహగల్ డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ తత్వవేత్త, పద్మభూషణ్ మృణాల్ మిరి, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, హెచ్‌సీయూ చాన్స్‌లర్ హనుమంతరావు హాజరుకానున్నారు.