ప్రపంచంలో సగం సంపద 1 శాతం మంది వద్దే!
వాషింగ్టన్: ప్రపంచంలో ఒక శాతం జనాభా వద్ద 50 శాతం సంపద ఉందని గ్లోబల్ ప్రైవేట్ వెల్త్ సర్వే ఒకటి తెలిపింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వార్షిక నివేదిక ప్రకారం... 1.85 కోట్ల కుటుంబాల వద్ద కనీసం 10 లక్షల డాలర్ల చొప్పున విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ మొత్తం సంపద విలువ 78.8 లక్షల కోట్ల డాలర్లని సంస్థ తెలిపింది. ఇది ప్రపంచ వార్షిక జీడీపీతో సమానం. రియల్టీని మినహాయిస్తే... నగదు, ఫైనాన్షియల్ అకౌంట్లు, ఈక్విటీల ప్రాతిపదికన మొత్తం ప్రపంచ సంపదలో ఇది 47%. 2013 మొత్తం సంపదలో ఈ ఒక శాతం జనాభా వాటా 45 శాతంకాగా, ఇది గత ఏడాది 47 శాతానికి చేరడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా వృద్ధిలో అసమానతలు సంపద పెరగడానికి కారణమని నివేదిక తెలిపింది. 80 లక్షల మంది మిలియనీర్లతో అమెరికా మొదటిస్థానంలో నిలిచింది. 20 లక్షల మంది మిలియనీర్లతో చైనా రెండవస్థానంలో ఉంది. జపాన్లో 10 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. జపాన్ను పక్కనబెడితే... రానున్న ఐదేళ్లలో ప్రపంచ సంపద వృద్ధిలో 40% ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే నమోదవుతుందని నివేదిక తెలిపింది. ఇందులో ప్రధాన వాటా చైనా, భారత్లదేనని పేర్కొంది.