యాపిల్.. మళ్లీ నంబర్ వన్
• గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానం కైవసం: గార్ట్నర్
• రెండో స్థానానికి శాంసంగ్...
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెకీ యాపిల్ తాజాగా మళ్లీ గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్ రారాజుగా అవతరించింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 17.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తన నివేదికలో పేర్కొంది. కాగా శాంసంగ్ 17.8 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్ఫోన్ విక్రయాలు 7 శాతం వృద్ధితో 43.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయని పేర్కొంది. గతేడాది మొత్తంగా చూస్తే విక్రయాలు 150 కోట్ల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. 2015తో పోలిస్తే విక్రయాల్లో 5 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది.
‘శాంసంగ్ స్మార్ట్ఫోన్ విక్రయాలు తగ్గుతూ రావడం ఇది వరుసగా రెండో త్రైమాసికం.
గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్మార్ట్ఫోన్ విక్రయాలు 8% తగ్గాయి. దీంతో శాంసంగ్ మార్కెట్ వాటా 2.9% క్షీణించింది’ అని గార్ట్నర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్సూల్ గుప్తా తెలిపారు. గతేడాది జూలై–సెప్టెబంర్ త్రైమాసికం నుంచే శాంసంగ్ స్మార్ట్ఫోన్ విక్రయాలు తగ్గడం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక గెలాక్సీ నోట్ 7 ఫోన్ను నిలిపివేయాలనే నిర్ణయంతో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలోనూ అమ్మకాలు క్షీణించాయని వివరించారు. ప్రారంభ, మధ్య స్థాయి స్మార్ట్ఫోన్ల విభాగంలోనూ హువావే, బీబీకే, ఒప్పొ, జియోనీ వంటి కంపెనీల నుంచి శాంసంగ్ గట్టి పోటీని ఎదుర్కొంటోందన్నారు.
ఎనిమిది త్రైమాసికాలు ఆగాల్సి వచ్చింది..
యాపిల్ నెం.1 స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం 8 త్రైమాసికాలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రెండు కంపెనీల మార్కెట్ వాటా మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రం చాలా స్పల్పంగా (2,56,000 యూనిట్లు– కేవలం ఒక శాతం ) ఉంది.