గ్రానైట్ నిక్షేపాలు కొంతే..
- కర్నూలు రోడ్డు కింద గ్రానైట్ విలువ రూ.1125 కోట్లే
- నివేదికలో తేల్చిన ఏపీఎండీసీ
- తొలుత అంచనా వేసింది రూ.30 వేల కోట్లు
- 3.5 కి.మీ పొడవున 30 మీటర్ల వెడ ల్పు, 60 మీటర్ల లోతున విలువైన రాళ్లు
- 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాళ్లున్నట్లు ధ్రువీకరణ
చీమకుర్తి : రామతీర్థంలోని కర్నూల్‌రోడ్డు కింద రూ.1125 కోట్ల విలువ చేసే గ్రానైట్ నిక్షేపాలు మాత్రమే ఉన్నట్లు హైదరాబాద్‌లోని ఏపీఎండీసీ జీఎం ప్రసాద్ గురువారం రాత్రి ధ్రువీకరించారు. కర్నూల్‌రోడ్డు కింద 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ నిక్షేపాలున్నట్లు తెలిపారు. ఒక్కో క్యూబిక్ మీటర్ రాయి సరాసరిన రూ.45 వేలు వంతున మొత్తం రూ.1125 కోట్ల విలువ చేస్తుందని అంచనా.
కర్నూల్‌రోడ్డు కింద ఒకప్పుడు 12 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి ఉందని, దాని విలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసి ఇటీవల మైన్స్ అధికారులతో పాటు హైదరాబాద్ నుం చి వచ్చిన ఉన్నతాధికారులు కర్నూల్‌రోడ్డును పరిశీలించారు. ఆ నిక్షేపాలను వెలికి తీయాలంటే కర్నూల్‌రోడ్డును తవ్వాలని, ప్రత్యామ్నాయం రోడ్డును చీమకుర్తి నుంచి మర్రిచెట్లపాలెం మీదుగా వేసేందుకు చర్యలు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. దాని మీద చీమకుర్తి వాసులు అడ్డం తిరిగి గ్రానైట్ రాళ్లకోసం కర్నూల్‌రోడ్డును తవ్వుతుటే ఊరుకోమని స్పష్టం చేశారు.
శాంపిల్స్ సేకరణ: ఎంత మేర గ్రానైట్ నిక్షేపాలున్నాయో అంచనా వేసేందుకు ఏపీఎండీసీ ఆధ్వర్యంలో గత జూలై నెలలో చీమకుర్తి నుంచి మర్రిచెట్లపాలెం వరకు రామతీర్థం మీదుగా 24వ కి.మీ రాయి నుంచి 28వ కి.మీ రాయి వరకు రోడ్డు మార్జిన్లలో డైమండ్ కోర్ డ్రిల్లింగ్ చేసి భూమి లోపలున్న గ్రానైట్ శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని ప్రత్యేక ల్యాబ్‌లో పరిశీలించి ఎంత లోతులో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి, వాటి నాణ్యత ఎంత అనే అంశాలను తేల్చారు.
గ్రానైట్ నిక్షేపాలున్నది ఇలా...
- ల్యాబ్‌లో పరిశీలించిన నివేదిక ప్రకారం ఏపీఎండీసీ అధికారులు కర్నూలు రోడ్డు కింద ఉన్న గ్రానైట్ నిక్షేపాల వివరాలు వెల్లడించారు.
- 24వ కి.మీ రాయి నుంచి 28వ కి.మీ రాయి వరకు మధ్యలో ఉన్న 3.5 కి.మీల పొడవున మాత్రమే గ్రానైట్ నిక్షేపాలున్నాయి.
- అటు, ఇటు చెరి అరకిలోమీటరు పొడవులో గ్రానైట్ రాళ్లు లేవు. అది కూడా కర్నూలు రోడ్డుకి 30 మీటర్ల వెడల్పున, 65 మీటర్ల లోతున మాత్రమే నాణ్యమైన నిక్షేపాలున్నాయి.
- వాటిని కూడా 25 అడుగుల వరకు తవ్వితే గానీ గ్రానైట్ నిక్షేపాలను వెలికి తీయలేమని నివేదికలో తేలింది. దానిని బట్టి కర్నూల్‌రోడ్డులో 30 అడుగుల వెడల్పు, 3.5 కి.మీ పొడవునా, 65 మీటర్లు లోతున 2.50 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి ఉందని చివరగా ధ్రువీకరించారు. దాని విలువ రూ.1125 కోట్లు ఉంటుందని ఏపీఎండీసీ అధికారులు తేల్చారు. దాని ప్రకారం వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతంలో క్వారీ నిర్వహించటం సాధ్యం కాదని అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.