ఇక అమ్మాయిలు ‘జ్ఞానజ్యోతులు’!
పింప్రి, న్యూస్‌లైన్: బాలికల్లో నిరక్షరాస్యత నిర్మూలనకు, వారిని బడిబాట పట్టించడం ప్రధాన లక్ష్యంగా పుణే విభాగ విద్యాబోర్డు ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే బాలికల శిక్షణా పథకం’ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేసింది. ఈ నెల 26 వరకు విభాగ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులోభాగంగా దేహూరోడ్డులోని మహాత్మా గాంధీ కంటోన్మెంట్ తెలుగు పాఠశాల ఆవరణలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రంగులరాట్నం, ఊయల, ఫన్‌ఫెయిర్, గ్యాస్ బెలూన్, మ్యూజికల్ చైర్, మ్యాజిక్ షో, క్యారమ్స్, బాలికలకు గోరింటాకు, బాలురకు టాటూస్లను వేసి పథకంపై అవగాహన కల్పించారు. ఆటపాటల్లో గెలిచిన బాలబాలికలకు బహుమతులను కూడా అందజేశారు. జిల్లాలో ఒక్క బాలిక కూడా నిరక్ష్యరాలుగా ఉండడానికి వీల్లేదని, బాలికలకు ప్రాథమిక, ఉన్నత విద్యతోపాటు సమాజంలో సమానత్వం, ఆర్థిక ఎదుగుదల కలిగించే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకంద్వారా జన జాగృతి కల్పిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేశ్ తెలిపారు.
పట్టణంలోని వందలాది మంది పిల్లలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవ్వడంతో పాఠశాల ఆవరణలో జాతర వాతావరణం నెలకొందన్నారు. పాఠశాలకు వచ్చిన పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారం, స్వీట్లు, పంచిపెట్టినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా విద్యాబోధన చేయించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు కమిటీ సభ్యులు బసన్న, వెంకటేష్ కోలి, శివప్రసాద్, రామాంజనేయులు, లక్ష్మీదేవి, మల్లన్న, సుధీర్ తదితరులు హాజరయ్యారు.