58 జీవోపై కబ్జా కన్ను
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రహసనంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్కారు భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీవో నంబర్ 58 ప్రకారం పేదల భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఈ క్రమబద్ధీకరణ కోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకోగా... ఇందులో అర్హులను గుర్తించ డం అధికారులకు తలకు మించిన భారంగా మారింది.
జిల్లాలోని కొన్నిచోట్ల ఏకంగా శిఖం భూములు, ఎన్ఎస్పీ భూములు, వక్ఫ్ భూములను సైతం ఆక్రమించి నివాసయోగ్యంగా మలుచుకున్నారు. వాటిని క్రమబద్ధీకరించమంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో అర్థంకాక అధికారులు తల పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకుని నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేదలకు 58 జీవో ప్రకారం ఉచితంగా, 59 జీవో ప్రకారం 250 గజాల భూమికి మార్కెట్ ధర ప్రకారం రుసుం చెల్లిస్తే రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా 58 జీవో కింద 125 గజాల స్థలం కోసం 23,023 మంది దరఖాస్తులు సమర్పించారు. వీటిలో 1804 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించినట్లు తెలుస్తోంది. 1212 దరఖాస్తులను స్కెచ్ అప్లోడ్, 1258 ఫొటోలతో అప్లోడ్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 23,023 దరఖాస్తుల్లో 1804 పోగా మిగిలిన దరఖాస్తులపై మళ్లీ అధికార యంత్రాంగం రీ సర్వే చేయనున్నట్లు సమాచారం. సర్వే అనంతరం ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది.
అభ్యంతరాలే అధికం
జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో పభుత్వ నిబంధనల ప్రకారం సగానికి పైగా అభ్యంతరకరమైనవే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 58 ప్రకారం 125 గజాల నివాసస్థలాన్ని ఉచితం గా క్రమబద్ధీకరించాలి. అయితే ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా అసైన్డ్, ఎన్నె స్పీ, శిఖం, కుంట భూములు ఉండటంతో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ఫలానా భూములను క్రమబద్ధీకరించాలని స్పష్టంగా చెప్పకపోవడంతో ఏమి చేయా లో పాలుపోని స్థితిలో అధికారులు ఉన్నారు.
ఆక్రమణల పర్వం
ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు 58, 59ని వ్యాపారులు, బడాబాబులు అనుకూలంగా మ లుచుకుంటున్నారు. ఆక్రమణల పర్వానికి తెరలేపారు. రాజకీయ నేతల అనుచరులు కొంద రు, సన్నిహితులు ఇదే పనిగా పావులు కదుపుతున్నారు. ఖమ్మంలో ప్రభుత్వ స్థలాలపై పట్టు న్న మాజీ ఉద్యోగులు, ఇతర మధ్యవర్తులు పేద ల ముసుగులో భూములను కాజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండను అడ్డుపెట్టుకొని ఆక్రమిత స్థలాలను కాజేయూలనే లక్ష్యంతో ఫెన్సింగ్ సైతం వేసినట్లు తెలుస్తోంది.
ఆర్డీవోలే కీలకం
క్రమబద్ధీకరణలో బృందాల పరిశీలన, ఫొటో ఆప్లోడ్ పక్రియ ముగిసిన తరువాత ఆర్డీవోలదే తుది నిర్ణయం. ఆయా బృందాలు అర్హులని తేల్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులు మరోమారు పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆయా మండలాల్లో ఇప్పటికే సర్వే పూర్తరుుంది. అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం కోసం...
క్రమబద్ధీకరణ పక్రియ చివరిదశకు చేరుకుంది. రెండు నెలలుగా అధికార యంత్రాంగం అన్ని ప నులకు స్వస్తి చెప్పి దీనిపైనే కుస్తి పట్టింది. వ చ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందాలు చివరకు అర్హులను తేల్చాయి. మిగి లిన దరఖాస్తులపై మారో మారు పరిశీలన జరుగుతుందంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడిన వెంటనే అర్హులకు పట్టాలు అందించేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు.