Goalkeeper David ospina
-
కొలంబియాకు మూడో స్థానం
► అమెరికాపై 1-0తో విజయం ► కోపా అమెరికా కప్ గ్లెండేల్ (అమెరికా): కోపా అమెరికా కప్‌లో కొలంబియా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య అమెరికా జట్టుతో ఆదివారం మూడు, నాలుగో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో కొలంబియా 1-0 గోల్‌తో నెగ్గింది. స్ట్రయికర్ కార్లోస్ బాకా (31వ నిమిషంలో) కొలంబియా తరఫున ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో 0-4తో ఓడిన అమెరికా ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గోల్ కీపర్ డేవిడ్ ఓస్పినా అడ్డుగోడలా నిలవడంతో పలు గోల్ ప్రయత్నాలు కూడా వమ్ము అయ్యాయి. ఈ టోర్నీలో కొలంబియా చేతిలో అమెరికా ఓడటం ఇది రెండోసారి. మ్యాచ్ తొలి 12వ నిమిషంలోనే స్టార్ ఆటగాడు జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ అవకాశాన్ని కీపర్ టిమ్ హోవర్డ్ అడ్డుకున్నాడు. అయితే ఆ తర్వాత అతనే ఇచ్చిన పాస్‌ను 31వ నిమిషంలో బాకా అతి సమీపం నుంచి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ద్వితీయార్ధంలో డెంప్సీ ఫ్రీకిక్ దాదాపు గోల్‌పోస్టులోకి వెళ్లినట్టే అనిపించినా ఓస్పినా ఒంటి చేత్తో దాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు. -
కొలంబియాను సెమీస్‌కు చేర్చిన డేవిడ్
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (అమెరికా): పెరూతో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో కొలంబియా గోల్‌కీపర్ డేవిడ్ ఓస్పినా తమ జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. బ్రెజిల్‌పై సంచలన విజయంతో క్వార్టర్స్‌కు చేరిన పెరూ ఈ మ్యాచ్‌లోనూ గట్టి పోటీనే ఇచ్చినా చివర్లో డేవిడ్ సూపర్ షో ముందు తలవంచింది. పెనాల్టీ షూటౌట్ దాకా వెళ్లిన ఈ మ్యాచ్‌లో అతను ప్రత్యర్థికి అడ్డుగోడలా నిలబడి జట్టు విజయానికి కారణమయ్యాడు. దీంతో కొలంబియా 4-2తో నెగ్గి కోపా అమెరికా కప్ సెమీఫైనల్స్‌కు చేరింది. షూటౌట్లో కొలంబియా తరఫున జేమ్స్ రోడ్రిగ్వెజ్, క్వాడ్రాడో, మోరెనో, లాస్ కేఫెటెరాస్ వరుసగా గోల్స్ సాధించారు. అటు పెరూ నుంచి డియాజ్, టాపియా రెండు గోల్స్ సాధించినా... మూడో ప్రయత్నంలో ట్రాకో షాట్‌ను అడ్డుకునేందుకు గోల్ కీపర్ డేవిడ్ పొరపాటున ఎడమ వైపు డైవ్ చేసినా తన కాలితో మాత్రం బంతిని అడ్డుకోగలిగాడు. నాలుగో షాట్‌ను క్యూవా క్రాస్ బార్ పైనుంచి పంపడంతో కొలంబియా విజయం ఖాయమైంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది. నిర్ణీత సమయంలోపు గోల్స్ చేయకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది.