దేవుడికి ఆరోగ్యం బాగోలేదట!
ఇదేంటి కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారా.. అవును, ‘‘దేవుడికి ఆరోగ్యం బాగోలేదు. అందువల్ల ఆయన భక్తులను చూడలేరు. ఆయన ప్రస్తుతం ఔషధ సేవలో ఉన్నారు.. 15 రోజులు విశ్రాంతి తీసుకుంటారు’’ అని ఆలయ ప్రధాన పూజారి చెబుతున్నారు. ఇదంతా ఎక్కడో తెలుసా? పూరీ జగన్నాథ ఆలయంలో. దేశంలో ఎక్కడా ఇలా లేదు గానీ, ఒక్క పూరీ ఆలయంలోనే ప్రతియేటా ఇలా చేస్తుంటారట. పూరీలోనే భగవంతుడు మానవరూపంలో ఉంటాడు. అందువల్ల మనుష్య ధర్మాన్ని భగవంతుడు పాటిస్తాడని అంటారు. ఆ ఆచారం ప్రకారం ‘జ్యేష్ఠ పూర్ణిమ’ తర్వాత.. పూరా జగన్నాథుడికి 35 స్వర్ణఘటాలతో స్నానం చేయిస్తారు. తర్వాత ఆయనను ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టి, మామిడిపళ్ల రసం ఇస్తారు.
ఎక్కువ సేపు స్నానం చేయడం, తర్వాత మామిడిరసం తాగడంతో భగవంతుడికి అనారోగ్యంగా ఉందని, అందువల్ల 15 రోజుల పాటు భోగాలు ఏమీ చేయకుండా కేవలం మూలికా ఔషధాలు మాత్రమే ఇస్తామని జగన్నాథ ధామ్ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ భట్టి తెలిపారు. ఆషా శుక్ల ఏకాదశి రోజున మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. అప్పుడు సుభద్ర, బలభద్రులతో కలిసి జగన్నాథుడు రథోత్సవంలో పాల్గొంటారు. భక్తుల తరఫున భగవంతుడికి ఒక విజ్ఞాపన పంపామని, ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత భక్తులు వచ్చి, ఆయన ఆశీస్సులు తీసుకుంటామని అడుగుతున్నారని భట్టి అన్నారు. దేవాలయం తిరిగి తెరిచిన తర్వాత భగవంతుడికి 21 రకాల పదార్థాలతో నివేదన చేసి, నగరంలో రథయాత్ర చేస్తామని తెలిపారు.