గోదావరికి పెరుగుతున్న వరద నీరు
భయాందోళనలో ముంపుగ్రామాల ప్రజలు
వెల్గటూరు: గోదావరిలో బ్యాక్‌వాటర్ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వెల్గటూర్ మండలంలోని ఉండెడ, చెగ్యాం, మక్కట్రావుపేట, కోటిలింగాల గ్రామాలను ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్ చుట్టుముడుతోంది. చెగ్యాం, మక్కట్రావుపేట, ఉండెడ గ్రామాల్లో ఎస్సీకాలనీల సమీపంలోకి వరద నీరు చేరుకుంది. కోటిలింగాలలో పుష్కరఘాట్లకు చెందిన మరో మూడు మెట్లు మునిగితే గ్రామంలోని నీరు చేరుతుంది. ఇప్పటికే కోటిలింగాలలో దక్షిణ భాగంలో ఉన్న పంట పొలాలన్నీ మునిగిపోయాయి. 12 టీఎంసీల నీటి మట్టం వద్దనే ఇలా ఉంటే.. 20 టీఎంసీలు వచ్చి చేరితే గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతుందని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముంపు గ్రామాల కోసం పునరావాస కాలనీలో తక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఏ రాత్రియినా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.