రంగుల గోదారి
సప్తవర్ణ శోభితం రోడ్ కం రైలు వంతెన
మలి సంధ్య వేళ పర్యాటకులకు కనువిందు
అంత్య పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణ
కొవ్వూరు : అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు గోదావరి కనువిందు చేయనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ రూ.90 లక్షలు వెచ్చించి రోడ్ కం రైలు వంతెన పై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. నదిలోని నీటిపై కాంతిపడేలా వీటిని అమర్చారు. ఈ దీపాలు రంగులు మారుతూ నదిని సప్తవర్ణ శోభితం చేస్తున్నాయి. రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరికి నిత్య నీరాజనం (హారతి) సమర్పించే సమయంలో సాయంత్రం 6.45నుంచి 7.45 గంటల వరకు ఈ లైట్లు వెలిగిస్తున్నారు.
ఆ సమయంలో నది ఒడ్డు నుంచి చూసేవారికి గోదావరి అందాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్ కం రైలు వంతెనపై మీదుగా రైలులో వెళ్లే ప్రయాణికులను సైతం రంగరంగుల గోదావరి కాంతులు పులకింపజేస్తున్నాయి. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విద్యుత్ దీపాలను పర్యాటక శాఖ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసింది.
కొరియా పరిజ్ఞానంతో..
దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్ఈడీ లను వారధిపై అమర్చారు. ఆర్ఈబీ (రెడ్, గ్రీన్, బ్లూ) లైట్లు ఒకదాని తరువాత ఒకటిగా రంగులు మారుతున్నాయి. రోజుల విశిష్టతను బట్టి రంగులు మార్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్వాంత్రంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో జాతీయ పతాకం రంగుల్లోను, హోలీకి వివిధ రంగులు వచ్చేవిధంగా వీటికి సెన్సార్లు అమర్చారు. ఈ లైట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు కాంతిపుంజాల్ని విరజిమ్ముతాయి.
వంతెన దిగువన ప్రతి 15 మీటర్లకు ఒకటి చొప్పున సుమారు 200 లైట్లు అమర్చారు. ఇందుకయ్యే విద్యుత్ వాడకం ఖర్చును రాజమండ్రి నగరపాలక సంస్థ భరిస్తుంది.