దారి తప్పిన ఉపగ్రహాలు!
పారిస్: ప్రపంచ ఉపగ్రహ దిశానిర్దేశ వ్యవస్థ(గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్) ఏర్పాటు కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ శుక్రవారం ప్రయోగించిన రెండు గెలీలియో ఉపగ్రహాలు సరైన ఎత్తుకు చేరడంలో విఫలమయ్యాయి. ఉపగ్రహాలు రెండూ నియంత్రణలోనే ఉన్నా.. వాటిని నిర్దేశిత ఎత్తులోని కక్ష్యలోకి చేర్చడం కష్టంగా మారిందని రష్యన్ సోయజ్ రాకెట్ ద్వారా వాటిని ప్రయోగించిన ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్స్పేస్ తెలిపింది. ఉపగ్రహాలు తక్కువ ఎత్తులోకి చేరినందున సమస్య పరిష్కార మార్గాల గురించి అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, గెలీలియో అనేది.. యూరోపియన్ యూనియన్ సొంత గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ. అమెరికా, రష్యాలకు చెందిన జీపీఎస్, గ్లోనాస్ నావిగేషన్ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా, వాటితో కలసి కూడా పనిచేయడం దీని ప్రత్యేకత. పూర్తిస్థాయి గెలీలియో నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.43 వేల కోట్ల వ్యయంతో 30 ఉపగ్రహాలను మోహరించాల్సి ఉంది. ఇంతవరకూ నాలుగు ఉపగ్రహాలను నింగికి పంపగా.. శుక్రవారం డోరెసా, మిలేనా అనే రెండింటిని పంపారు. కానీ అవి తక్కువ ఎత్తుకే చేరడంతో ఇప్పుడు అనుకోని అవాంతరం ఎదురైంది.