Gold Ganesh
-
‘బంగారు’ గణపయ్య
కంటోన్మెంట్ : బోయిన్‌పల్లిలో రెండు దశాబ్దాలుగా ప్రతీయేటా వినూత్న రీతిలో గణపతి మండలపాలను ఏర్పాటు చేస్తున్న రాణా ప్రతాప్ యువసేన ఈ సారి గణపతిని బంగారు వెండిమయం చేస్తున్నారు. సుమారు రూ.లక్ష విలువ చేసే ‘ఫైబర్ గణపతి’ని పుణేలో ప్రత్యేకంగా తయారు చేయించిన నిర్వాహకులు... గణపతికి కేజీ బంగారం చైన్, నాలుగు కేజీల వెండి కిరీటాన్ని సైతం తయారు చేయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగే గణపతి కలశ స్థాపనలో ఆయా ఆభరణాల్ని అలంకరించనున్నారు. కాగా ఫైబర్ గణపతిని బోయిన్పల్లి హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టంచనుండగా, ఆభరణాలను రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో బ్యాంకులో భద్రపరచనున్నట్లు నిర్వాహకులు జంపన ప్రతాప్, ఆనంద్‌బాబు, గోవర్థన్‌రెడ్డి, అరుణ్ కుమార్ తెలిపారు. -
రిమోట్‌తో మాట్లాడే గణనాథుడు
-‘ఖని’లో పాలిటెక్నిక్ స్టూడెంట్ వినూత్న ప్రయోగం కోల్‌సిటీ మనం హాలో అంటే తిరిగి హాలో అంటాడు.. కళ్ల కదిలించడమే కాదు.. మూయడం, తెరవడం కూడా చేస్తాడు. ఓంకార శ్లోకాన్ని చదివి వినిపిస్తాడు. చేతిలో లడ్డును గుండ్రంగా తిప్పుతాడు.. ఇవి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో వెలసిన విఘ్ననాయకుడి ప్రత్యేకతలు.. అయితే, ఇవన్నీ ఈ గణేషుడు రిమోట్ సహాయంతో మాత్రమే చేస్తాడు. ఇన్ని ప్రత్యేకతలున్న వినాయకుడిని స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి బోశెట్టి భగత్‌ప్రశాంత్ తయారు చేశాడు. రెండు అడుగుల ఎత్తు, 10 కిలోల బరువుతో ఉన్న ఈ గణనాథున్ని బంగారు రంగులతో అలరిస్తున్నాడు. గోల్డ్ గణేష్‌గా పిలుస్తున్న ఈ విగ్రహానికి అనుసంధానం చేసిన రిమోట్ బటన్స్ నొక్కితే ఈ వినాయకుడు పైన చెప్పినవన్నీ చేస్తున్నాడు. అంతేకాదు వినాయక విగ్రహం ముందు ఏర్పాటు చేసిన మూషిక కళ్లలో వెలుగులు వస్తాయి. ఇలా వినూత్నంగా ఉండేలా భగత్‌ప్రశాంత్ విగ్రహాన్ని కేవలం రూ.500లతో తయారు చేశాడు. ఈ వినాయకుడిని చూసేందుకు స్థానికులు భగత్ ఇంటికి వెళ్తున్నారు. వినాయక చవితి పండుగలో డిఫరెంట్‌గా ఉండాలని రిమోట్ కంట్రోల్‌తో మాట్లాడే వినాయకుడిని తయారు చేసినట్లు బోశెట్టి భగత్‌ప్రశాంత్ తెలిపారు.